mt_logo

కేసీఆర్, కేటీఆర్ లను పొగడ్తలతో ముంచెత్తిన అక్బరుద్దీన్ ఒవైసీ

తెలంగాణ ఏర్పడిన కొద్దికాలంలోనే అన్ని రంగాల్లో రాష్ట్రం అసాధారణ ప్రగతిని సాధిస్తున్నదని, ఈ ఘనతకు కారణం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అని వారిని ప్రశంసలతో ముంచెత్తారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుతో భారీ నీటిపారుదల వ్యవస్థను పటిష్ఠంచేస్తే.. మిషన్‌ కాకతీయతో చిన్ననీటిపారుదల వ్యవస్థ బలోపేతమైందని అన్నారు. దేశమంతా ముక్కున వేలేసుకొనేలా 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్తును అందిస్తూ వారి ముఖాల్లో చిరునవ్వును నింపారంటూ కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

సోమవారం అసెంబ్లీలో ఐటీ, పరిశ్రమల రంగంపై చర్చలో అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ.. ఐటీలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని.. ఇందుకు ఓ హైదరాబాదీగా గర్వపడుతున్నానని చెప్పారు. నిజాంకాలంలో పలు పరిశ్రమలను ఏర్పాటు చేస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ముందుచూపులేక మూతపడేలా చేశారని, ఇప్పుడు సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారని అన్నారు. రాష్ట్రమంతా వ్యవసాయంతో పాటు పారిశ్రామికాభివృద్ధికీ సమప్రాధాన్యమిస్తున్నారని కొనియాడారు. పవర్‌ హాలిడేలతో పరిశ్రమలు నడుపుకోలేని దుస్థితి నుంచి ఇవ్వాళ మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారని అన్నారు. ప్రపంచం అంతా కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్రం మాత్రం అన్ని రంగాల్లో అద్వితీయ ప్రగతి సాధించేలా కృషి చేసారంటూ సీఎం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

ఐటీ ఘనత మంత్రి కేటీఆర్‌ది :

ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు తమ ద్వితీయ క్షేత్రంగా హైదరాబాద్‌ను ఎంచుకోవటం వెనుక మంత్రి కేటీఆర్‌ కృషి అసామాన్యమైందన్నారు. ఐటీ అంటే బెంగళూరు అన్న స్థితిని హైదరాబాద్‌ తిరగరాసిందన్నారు. ఐటీని రెండోశ్రేణి నగరాలైన వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ వంటి జిల్లాలకు విస్తరించి స్థానిక యువతకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఆర్బీఐ సహా పలు జాతీయ సంస్థలు ఇచ్చిన నివేదికల్లో హైదరాబాద్‌ ఐటీ ఎగుమతులు జాతీయ సగటు కన్నా రెట్టింపు ఉండటం గొప్ప విషయమన్నారు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ వంటి గొప్ప కంపెనీలను హైదరాబాద్‌కు తేవడంలో కేటీఆర్‌ డైనమిక్‌గా వ్యవహరిస్తున్నారని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *