By సరస్వతి రమ
ప్రాణం నిలవడం కోసం పనిచేసేవాడు సగటు మనిషి
పని కోసం ప్రాణం పెట్టేవాడు గొప్ప మనిషి
చరిత్రలో స్థానం కోసం పాకులాడేవాడు స్వార్థపరుడు
చరిత్రనే సృష్టించినవాడు మహనీయుడు
ఆ గొప్ప మనిషి, మహానీయుడే . చరిత్ర మరిచిన అక్షర పిపాసి.
తన రాతలతో రజాకార్లకు వాతలు పెట్టిన నిప్పు రవ్వ. జగం మరచిన గ్రేట్ జర్నలిస్ట్.
ఒక తరం తప్పిదాన్ని, పాలకుల నిర్లక్ష్యాన్ని క్షమిస్తూ తెలంగాణ కలం వీరుడికి చేతనైన నివాళి ఈ సిల్‌సిలా….
అరవై మూడేళ్ల కిందట…సరిగ్గా ఇదే రోజున అర్థ రాత్రి…
సమయం ఒకటిన్నర…
ఎప్పటిలాగే పత్రిక విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు 28 ఏళ్ల యువకుడు. రోజూలాగే పిచ్చాపాటి మాట్లాడుకుంటూ గేటుదాకా అతన్ని సాగనంపాడు పత్రిక యజమాని అన్న కొడుకు. బావమరిది మహ్మద్ ఇస్మాయిల్‌ఖాన్‌తో కలిసి ఇంటికి బయలుదేరాడు ఆ యువకుడు. కొంచెం దూరం వెళ్లారో లేదో మాటు వేసున్న దుండగులు యువకుడిపై వేటు వేశారు. తన రాతలతో రజాకార్ల గుండెల్లో గుబులు పుట్టించిన ఆ చేతులను నిర్దాక్షిణ్యంగా నరికేశారు. అది చాలదన్నట్లు భయమంటే తెలియని ఆ గుండెను తుపాకి గుళ్లతో చిద్రం చేశారు. ఆ అకృత్యాలను అడ్డుకోబోయిన ఇస్మాయిల్‌ఖాన్ చేతికీ గాయం చేశారు. తన బావను చంపుతున్నారన్న ఇప్మాయిల్‌ఖాన్ కేకలకు చుట్టపక్కలున్న జనం పరుగెత్తి రావడంతో దుండగులు పారిపోయారు. ఆ కేకలకు వీళ్లను గేటుదాకా సాగనంపిన యువకుడూ ఉలిక్కిపడి హుటాహుటిన బయటకు వచ్చాడు. చూస్తే ఏముంది? రక్తం మడుగులో పడి ఉన్నారు ఇద్దరు. అందరూకలిసి ఉస్మానియా హాస్పటల్‌కు తీసికెళ్లారు. రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన ఆ యువకుడు‘ ఈ పత్రికను కొనసాగించండి. ధర్మానికే జయం, నేను వెళ్లిపోతున్నాను’ అని చెప్పి కన్ను మూశాడు.
కణకణ మండిన ఓ నిప్పు కణమే షోయబుల్లా ఖాన్. ఆ పత్రిక పేరే ఇమ్రోజ్. ఆ రోజు రాత్రి షోయబుల్లాఖాన్‌ను గేటుదాకా సాగనంపిన పదహారేళ్ల కుర్రాడు ఎవరో కాదు బూర్గుల రామకృష్ణారావు అన్నకొడుకు కామ్రేడ్ నరసింగరావు. షోయబుల్లాఖాన్ స్నేహితుడు, ఆయన గురించి ఎంతోకొంత చెప్పగలిగే ఏకైక సోర్స్. అందుకే షోయబుల్లా ఖాన్ వర్ధంతికి స్టోరీలు, వ్యాసాలు రాయడానికి జర్నలిస్టులు ఆయనింట్లో బారులు తీరారు.
షోయబుల్లాఖాన్ హత్య జరిగేనాటికి ఆయనకు రెండు సంవత్సరాల కూతురు, భార్య నిండు చూలాలు. షోయబ్ చనిపోయాక ఆ కుటుంబాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పునాదులు కోల్పోయిన ఆ ఫ్యామిలీ ఉత్తరవూపదేశ్‌లోని కాయంగంజ్‌కు వలస వెళ్లింది. షోయబ్ తండ్రి నాలుగేళ్లపాటు వాళ్ల దగ్గర, వీళ్ల దగ్గర ఆర్థిక సాయం పొంది తర్వాత అతను కూడా కోడలి దగ్గరికి వెళ్లిపోయాడు. సిల్‌సిలా శీర్షిక కోసం షోయబుల్లాఖాన్ కుటుంబం కోసం ఎంత ఆరా తీసినా ఇంతకు మించిన వివరాలు దొరకలేదు. చాలామంది అందరికి తెలిసున్న కొన్ని వివరాలే చెప్పారు కాని ఆయన భార్య, పిల్లల గురించి ఎవరూ చెప్పలేదు. చివరకు బూర్గుల నరసింగరావును కలిస్తే…పైన విషయాలే చెప్పారు. షోయబ్ భార్య కొంతకాలం కిందట చనిపోయిందని, అతని మనవరాలు ఈ మధ్యే ఇక్కడకు వచ్చి,ఇక్కడే ఉంటోందని, అతని చెల్లి కూడా ఇక్కడే(హైదరాబాదు) ఎక్కడో ఉంటోందని, తొంభై ఏళ్ల వృద్ధురాలైందని బూర్గులకు ఎవరో చెప్పారట. తనూ వాళ్ల కోసం ఆరా తీస్తున్నానని చెప్పారు. షోయబ్ గురించి, ఆయనతో తనకున్న సాంగత్యం, అప్పటి పరిస్థితులను పంచుకుంటూ…
‘షోయబుల్లాఖాన్‌తో నాకున్న సాంగత్యం పద్దెనిమిది నెలలే. ఇమ్రోజ్ పెట్టక ముందు ఆయనంటే ఎవరో నాకు తెలుసు, నేను ఫలానా అని ఆయనకు తెలుసు. అంతే. కాని ఇమ్రోజ్ పెట్టాక ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. మా ఇంట్లోనే (బూర్గుల రామాకృష్ణారావు ఇంట్లో) ఇమ్రోజ్ ఆఫీస్ ఉండేది. రోజు సాయంకాలం అతనితో బాతాఖానీ చేసేవాడిని. అప్పుడు నాకు పదహారేళ్లు. ఆయనకు నాకు పన్నెండేళ్ల అంతరం. కాని నన్ను చిన్నపిల్లాడిలా ఎప్పుడూ చూడలేదు. పైగా ఎన్ని విషయాలో చర్చించేవాడు. అప్పుడప్పుడే నేను కమ్యూనిజం ఆకర్షణకు లోనవుతున్నాను. ఈ విషయం ఆయనకు తెలుసు. ‘ క్యా..బాబూ..తమ్హారే పార్టీవాలోనే ఆజ్ క్యా కియా? అని సోవియట్ రష్యాలో జరుగుతున్న హింసాకాండను ఉద్దేశించి ‘ క్యా జనాబ్..ఆప్‌కే సోవియట్ ముల్క్ మే క్యాహోరాహా ైహై ఆజ్‌కల్?’ అంటూ వ్యంగ్యోక్తులు విసిరేవాడు నామీద. అవన్నీ నేను బాగా ఎంజాయ్‌చేసేవాడిని. చాలా ఓపెన్గా ఉండేవాడు. దేన్నయినా గుడ్డిగా నమ్మేవాడు కాదు. చాలా తార్కిక దృష్టి. అందుకే సోవియట్ యూనియన్‌లో స్టాలిన్ నియంతృత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడేవాడు. ప్రజాస్వామ్యంలేని సోషలిజం ఎందుకని వాదించేవాడు. ఎమ్‌ఎన్ రాయ్ రాడికల్ హ్యూమనిస్ట్ పత్రికను తెప్పించుకునేవాడు. చదవమని నాకూ ఇచ్చేవాడు. అంటే అన్నింటి మీదా నాకు సునిశిత దృష్టి పెరగాలని ఆయన ఆలోచన. మొత్తానికి ఆయన చెలిమి నాకు చాలా నేర్పింది.
జర్దాపాన్…సిగరెట్
ఆయన రాతలు చాలా సీరియస్సే కాని మనిషి మాత్రం సరదాగా ఉండేవాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. సైద్ధాంతిక చర్చలప్పుడు కూడా అనవసర ఘర్షణలకు దిగేవాడు కాదు. చర్చను కూడా నెమ్మదిగా, నిలకడగా చేసేవాడు. జర్దాపాన్, సిగట్ ఆయన అలవాట్లు. షోయబుల్లాఖాన్ మంచి పెయింటర్. పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. రవీంవూదనాథ్ ఠాగూర్‌ది పెద్ద పోట్రయిట్ గీసాడు. ఉర్దూ, ఇంగ్లీష్ సాహిత్యాలంటే ప్రాణం పెట్టేవాడు. నిజానికి అప్పటి అంటే 1946, 48లో హైదరాబాద్ స్టేట్ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. 1947లో ఇండియాకు స్వాతంత్య్రం రావడం. చిన్న చిన్న సంస్థానాలు ఇండియాలో విలీనం కావడం… ఇక్కడేమో నిజాం విలీనానికి వ్యతిరేకంగా ఉండడం, హైదరాబాద్‌ను‘ ఆజాద్ హైదరాబాద్’ గా ప్రకటించడం, రజాకార్లు పుట్టుకురావడం..ఇవన్నీ విపరీత పరిణామాలు.
అప్పుడు షోయబుల్లాఖాన్ చేసిన అక్షర ఉద్యమం నిజంగా అప్పటి ప్రజల్లో చైతన్యం పుట్టించింది. ఏ మూల నిజాం ఆగడాలు చెలరేగుతున్నా, ఎక్కడ ఆర్మీ క్యాంప్స్ ఉన్నా వాటి గురించి నిర్భయంగా రాపేవాడు. హైదరాబాద్ ఇండియాలో విలీనం కావాల్సిందేనని తన రాతలతో స్పష్టం చేసేవాడు. నిజామ్‌కు వ్యతిరేకంగా ఉన్న ముస్లిం విద్యావంతుల అభివూపాయాలను ప్రచురించేవాడు. నిజాం మొండితనానికి, రజాకార్ల ఉన్మాదానికి ఎక్కువ బలవుతోంది పేద ముస్లిం కుటుంబాలు, యువకులేనని ఎన్నో సార్లు ఆవేదన చెందాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు భారతవూపభుత్వంతో మాట్లాడి షరతుల మీదైనా సరే ఇండియాలో విలీనం చేయాలని ఎన్నో వ్యాసాలు రాశాడు. లేకపోతే తర్వాత జరిగే విపరీత పరిణామాలకు నిజాం ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా హెచ్చరించాడు. ఆయన అన్నట్టుగానే పోలీస్ యాక్షన్ జరిగింది. ఏమైంది? భారత్‌లో విలీనం కాక తప్పలేదు.
కాని ఎంత మంది యువకుల ప్రాణాలు పోయాయి? హైదరాబాద్ ఇండియాలో విలీనం కావడమనేది షోయబుల్లాఖాన్ కల. లక్ష్యం. దాని కోసం నడిరోడ్డుమీద ప్రాణాలను బలిపెట్టాడు. అలాంటి త్యాగమూర్తికి మనమిచ్చిన గౌరవం… మలక్‌పేటలో ఆయన పేరు మీద ఒక గదితో లైబ్రరీ, చుట్టూ చిన్న పార్కు. ఇంతే. చూద్దామంటే ఆయన విగ్రహం లేదు. తర్వాత తరాలు తెలుసుకోవడానికి చరిత్ర లేదు. ఎంత విచిత్రం? పాత్రికేయ వృత్తికే వన్నె తెచ్చిన నిజాయితీపరుడు. ఇవాళ ఎంతమందికి తెలుసు ఆయనంటే? ఇంత నిర్లక్ష్యమా?’ ఆవేదన చెందారు బూర్గుల నరసింగరావు’.
నిజమే..ఎంత అలక్ష్యం? తెలంగాణ నిప్పు రవ్వకు టాంక్‌బండ్ మీద జాగ లేదు. పరాయి ప్రాంతం వాడైనా శ్రీకృష్ణదేవరాయలు రాజసంగా తిష్టవేస్తాడు. జన్మలో తెలంగాణపేరు తలవని వైతాళికులు ఠీవిగా కొలువుదీరి ఉంటారు. కాని హైదరాబాదు విముక్తి కోసం ప్రాణాలు ఇచ్చిన నిస్వార్థుడికి ట్యాంక్‌బండ్ మీద కాదు చరివూతలోనే స్థానం లేకుండా చేశారు. ఈ పాపం ఎవరిది?
జర్నలిజం షాన్
1919, అక్టోబర్ 2 షోయబుల్లాఖాన్ పుట్టినరోజు. హబీబుల్లాఖాన్, షయిబుల్లా ఆయన తల్లిదంవూడులు. స్వంత ఊరు ఖమ్మం జిల్లా, సుబ్రదేవ్. తండ్రి రైల్వే కానిస్టేబుల్ అవడంతో ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చింది ఆ కుటుంబం. ఉస్మానియా యూనివర్శిటీలో చదువు ముగించుకుని షోయబుల్లాఖాన్ బయటకు వచ్చేనాటికి హైదరాబాద్‌లో పరిస్థితులు ఏమీ బాగాలేవు. అంతటా నిజాం దురాగతాలే. నిజానికి ఆ కాలంలో షోయబుల్లా ఖాన్ కోరుకున్న ఉద్యోగం ఆయన కాళ్ల దగ్గర ఉండేదే. కాని పొట్ట కూటి కన్నా ప్రజల్లో చైతన్యం తేవడమే మిన్న అనుకున్నాడు. అందుకే పాత్రికేయ వృత్తివైపు మొగ్గు చూపాడు. కర్తవ్యానికి తలవంచాడు. ఆయన ఆవేశానికి అక్షరాలు కట్టలు తెంచుకున్నాయి. వాటికి మొట్టమొదటి వేదిక ‘తేజ్’ అక్బార్. ఉర్దూ అధికార భాషగా ఉన్న ఆ కాలంలో దాదాపు పత్రికలన్నీ ఉర్దూలోనే ఉండేవి. ఒకటి రెండు తప్ప అన్ని పత్రికలూ నిజాం ప్రభుత్వానికి కొమ్ముకాసేవే. షోయబుల్లాఖాన్ ఆ ఒకటి రెండు పత్రికలనే ఎంచుకున్నాడు. నిజాం ఆగడాలను అక్షరాల్లో బంధించాడు. నికృష్టాల నిగ్గు దేల్చాడు. అది నిజాంకు నిద్ర లేకుండా చేసింది. ఫలితం తేజ్ పై నిషేధం.
షోయబుల్లా ఖాన్ స్మృతి చిహ్నంగా నెలకొల్పిన గ్రంధాలయం
—
రయ్యత్‌లో రాతలు
తేజ్ ఆగిపోవడంతో షోయబుల్లాఖాన్ వణికిపోలేదు. తన పెన్నుకు ఇంకెక్కడ కాగితం దొరుకుతుందోనని వెదికాడు. ఆయన ఆశ వట్టిపోలేదు. అప్పటికే మందుముల నరసింగరావు నడుపుతున్న రయ్యత్‌లో చేరాడు. రయ్యత్‌లో చేరిన షోయబుల్లాఖాన్ కలం వైఖరిలో ఇసుమంత మార్పులేదు. పైగా పదను పెరిగింది. నిజామ్ అక్రమాలను ఘాటుగా విమర్శించేవాడు, మందుముల కూడా ఆయనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చేవాడు. ఇందులోని వ్యాసాల చైతన్యంతో ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసనలను జీర్ణించుకోలేక నిజామ్‌లు రయ్యత్‌నూ నిషేధించారు. ఏం చెయ్యాలి? అప్పుడే కాంగ్రెస్ నాయకులు, మందుముల నర్సింగరావు బావ అయిన బూర్గుల రామకృష్ణారావు తమ తరఫున నిజాం దౌర్జన్యాలను ఎండగట్టే ఒక పత్రికుండాలని ఆరాటపడుతున్నాడు. షోయబుల్లాఖాన్ బూర్గుల సహాయంతో నగలునట్రా అమ్మి ‘ఇవూమోజ్’ను స్థాపించారు.
ఇమ్రోజ్…ఈ రోజు
ఉర్దూలో ఇమ్రోజ్ అంటే ఈ రోజు. అంటే నాడే ఈనాడు పేరుతో ఓ పత్రికొచ్చిందన్నమాట. ఈ విషయం తెలియని ఆంధ్రోళ్లు నేటి ఈనాడును పత్రికలకు పెద్దన్నను చేశారు. నిజంగా తెలియకా? లేక తెలిసిన ప్రేరణా? ఏదైతేనేమి అగ్నికణిక లాంటి నాటి ఇమ్రోజ్‌కు నేటి ఈనాడుకు మాత్రం హస్తిమశకాంతరం తేడా ఉంది. షోయబుల్లాఖాన్ పెన్ను గన్నయింది. అక్షరాలు బులెట్లలా నిజాం గుండెల్లోకి దూసుకుపోయాయి. ఆయన రాతలు రజాకార్లకు వాతలు పెట్టాయి. వెన్నులో వణుకు పుట్టించాయి. దడ పుట్టిన నిజాం, ఖాసీం రజ్వీలు షోయబుల్లాఖాన్‌కు బెదిరింపు లేఖలు పంపారు. అయినా షోయబుల్లాఖాన్ అక్షరాలు తడబడలేదు. ఇంకిన్ని అన్యాయాలను పోతపోశాయి. ఛలో ఢిల్లీ కార్యక్షికమం ద్వారా ఢిల్లీ వెళ్లి ఎర్రకోట మీద నాటి నిజాం జెండా అసిఫియా పతాకాన్ని ఎగురవేస్తానని ఖాసిం రజ్వీ చేసిన ప్రకటనకు షోయబుల్లాఖాన్ ఆవేశం కట్టలు తెగింది. దాన్ని తీవ్రంగా నిరసించాడు.
రాతల్లో ఆక్షేపించాడు. షోయబుల్లాఖాన్ హత్యకు కొన్ని రోజుల ముందు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు రాసిన వాళ్ల చేతులను నరికేస్తామని, అలాంటి పత్రికలను సర్వ నాశనం చేస్తామని బహిరంగంగానే ప్రకటించాడు. బెదిరించాడు. ప్రభుత్వ వ్యతిరేకులను దేశవూదోహులుగా కూడా ప్రకటించాడు రజ్వీ. అయినా షోయబ్ తన దారి మరలలేదు. ఆగస్టు 20 న అంటే అతని హత్యకు ఒక ముందు కూడా ఆయన్ని తిడుతూ ఒక ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. బూర్గుల, ఇంకొంతమంది ఇమ్రోజ్ ఆఫీస్‌లో షోయబుల్లాఖాన్‌తో చాలా సేపు మాట్లాడారు. ఆ సందర్భంలోనే తనకు వచ్చిన బెదిరింపు లేఖలను చూపించాడు. ‘ఇది వట్టి బెదిరింపుగానే చూడకు, జాగ్రత్తగా ఉండు’ అని బూర్గుల షోయబ్‌కు సూచించారు కూడా. ఆశయ సాధన కోసం ప్రాణాలు అర్పించడానికైనా తాను సిద్ధమేనని సమాధానమిచ్చాడు షోయబ్. అన్నట్టుగానే ఆ మరుసటి రోజు అర్థరాత్రి తన ఆశయం కోసం నిండు ప్రాణాన్ని పణంగా పెట్టాడు. పాత్రికేయ వృత్తికి పరమార్థంగా నిలిచాడు.
ఫోటోలు: రాజేష్, శ్రీనివాస్
నమస్తే తెలంగాణ దినపత్రిక నుండి