కాంగ్రెస్ పార్టీ మరోసారి మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్ లో విలేకరుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని, దీనిపై తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బహిరంగ చర్చకు రావాలని, ఈ విషయంపై చర్చించేందుకు నేను ఎక్కడికైనా వస్తా అని అన్నారు. 2009 మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో భాగంగా రైతులకు 9గంటలు కరెంటు ఇస్తామని కనీసం 5గంటలు కూడా ఇవ్వలేదని, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచారని కాంగ్రెస్ పార్టీపై హరీష్ మండిపడ్డారు.
కేసీఆర్ ను ఉద్దేశిస్తూ గడీల పాలన, దొరల పాలన అని పొన్నాల లక్ష్మయ్య అంటున్నాడని, అసలు దొర ఎవరో, గడీలు ఎవరికి ఉన్నాయో పొన్నాల సొంతూరు ఖిలాషాపురం కైనా, కేసీఆర్ స్వస్థలం చింతమడక కైనా వెళ్లి అడుగుదామని అన్నారు.దొరతనం అనేది కులం బట్టి రాదని, వ్యక్తి గుణం బట్టి వస్తుందని, నమ్ముకున్న సిద్ధాంతం కోసం కేసీఆర్ పదవులను, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారని పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలు కేవలం డిపాజిట్లు మాత్రమే దక్కించుకుంటాయని, ఓటమి భయంతోనే చంద్రబాబు బీసీ జపం చేస్తున్నాడని, పొత్తులుంటే తప్ప ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయలేడని, నరేంద్ర మోడీ కాళ్ళా, వేళ్ళా పడి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ గెలుపు ఖాయమని, భారీ మెజార్టీ కోసమే కృషి చేయాలని హరీష్ రావు కార్యకర్తలకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.