ఆదివారం సాయంత్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో టీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం బహిరంగసభలో పాల్గొన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ గడ్డమీద ఒక పాలసీని ప్రకటిస్తున్నానని, తెలంగాణ రాష్ట్ర సమితి నూటికి నూరు శాతం సెక్యులర్ పార్టీ అని, ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. మతతత్వ పార్టీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని, ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీయే కూటమిలో చేరమని తేల్చిచెప్పారు. తెలంగాణలో అన్ని మతాలు, కులాలు కలిసి ఉంటాయని, హిందూ, ముస్లిం, సిక్కులు అందరూ భాయి భాయి అంటూ కలిసి బతకాల్సి ఉందని చెప్పారు.
దేశంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 200 సీట్లు మించి రావని తెలిపారు. కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల కూటమి మాత్రమేనని, సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఓట్లు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే వేయాలని కేసీఆర్ చెప్పారు. ఈ ఎన్నికలు మామూలు ఎన్నికలు కాదని, ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఒక తరానికి దెబ్బ తగులుతుందని, ఆంధ్రా వాళ్ళతో పంచాయితీ ఇంకా అయిపోలేదని తెలంగాణ ప్రజానీకానికి సూచించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకలజనుల సమ్మె చేస్తున్నప్పుడు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు వెకిలి నవ్వులు నవ్వి జల్సాలు చేశాయని, బంగారు తెలంగాణ కావాలన్నా, మన కలలు నెరవేరి తెలంగాణ పునర్నిర్మాణం జరగాలన్నా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.
తాము మేనిఫెస్టో లో పొందుపరిచినవన్నీ తూచా తప్పకుండా నూటికి నూరు శాతం అమలుచేసి తీరుతామని, ఇందులో ఎటువంటి సందేహాలు అవసరం లేదని అన్నారు. పావలా పనిచేసి ముప్పావలా దిగమింగితే పనులు ముందుకు పోవని ఆయన అన్నారు. ఈ సభలో టీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు, నాయిని నర్సింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, వివిధ ప్రాంతాల నుండి కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.