గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా నిర్మితమైన శిల్పా లే అవుట్ పై వంతెనను ఈ నెల 24న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేత ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా 313.52 కోట్లతో నిర్మించిన ఈ 17వ వంతెనతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్య మరింత తగ్గే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా గచ్చిబౌలి వరకు వచ్చి కొత్త ఫ్లైఓవర్ పై నుంచి ఏఐజీ హాస్పిటల్, ఐకియా, మైండ్‌స్పేస్, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్ చెక్ పోస్టుకు నేరుగా ప్రయాణం చేయవచ్చు.
కాగా ఈ వంతెన ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దేశంలోనే హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. నగరం శరవేగంగా అభివృద్ధి చెందేలా ఎక్కడా రాజీ పడకుండా ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నదని వెల్లడించారు. ఫ్లైఓవర్ల రాకతో నగరవాసుల జర్నీ సమయం 45 నిమిషాల నుంచి గంట వరకు తగ్గుతున్నదని చెప్పారు. పౌరుల డిమాండ్‌కు అనుగుణంగా లింకు రోడ్లు, అండర్‌పాస్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు రవికిరణ్, శంకరయ్య, ప్రాజెక్టు సీఈ దేవానంద్, ఎస్‌ఈ వెంకట రమణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.