డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. అదే రోజు పట్టణంలోని లోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ కలెక్టర్ వెంకట్రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేసి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. టీఆర్ఎస్ కార్యాలయ భవనం ప్రారంభంతోపాటు మినీ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. డిసెంబర్లోనే నర్సింగ్ కళాశాల ప్రారంభం అవుతుందని మంత్రి తెలిపారు.
