తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం కోసం వీలైనంత వరకు ప్రైవేటు భూముల వినియోగాన్ని తగ్గించి అటవీభూములను వినియోగించేలా అధికారులు ప్రణాళికను రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు స్థాయిల్లో 1.20 లక్షల కిలోమీటర్ల పైప్ లైన్ ఏర్పాటుకు 1703.61 ఎకరాల భూమి అవసరమని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు అంచనా వేశారు. 1003.25 ఎకరాల అటవీభూమి, 581.71 ఎకరాల ప్రభుత్వ భూమి, 118.65 ఎకరాల ప్రైవేటు భూమి సేకరించాలని ఆర్ డబ్ల్యూఎస్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
జిల్లాలవారీగా పైప్ లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు అటవీశాఖ, ప్రైవేటు వ్యక్తుల నుండి అనుమతులు పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకునే బాధ్యతను జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అటవీభూముల సేకరణకు అనుమతి కోరుతూ ఇప్పటికే జిల్లా అటవీ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు దరఖాస్తు చేశారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూముల వినియోగానికి అవసరమైన చర్యలను జిల్లా జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు.