సబ్సిడీ బియ్యంతో పాటు సన్నబియ్యం పథకాన్ని సక్రమంగా అమలయ్యేలా చూడాలని, అవినీతికి పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో జాయింట్ కలెక్టర్లతో మంత్రి ఈటెల సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మే నెల నుండి రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ శాశ్వత ఆహారభద్రత కార్డులు అందజేస్తామని, కొత్త కార్డుల జారీ కోసం అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమని, ప్రజలకు కడుపునిండా అన్నం పెట్టాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమని, గత ప్రభుత్వాల తరహాలో కాకుండా తెలంగాణ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ అనుక్షణం ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. ప్రభుత్వ పథకాలను, వాటి ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకుని పని చేయాలని జాయింట్ కలెక్టర్లకు సూచించారు. ఎప్పటికప్పుడు బియ్యం పరిస్థితిని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు సమీక్షించాలని, అక్రమాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రవేశపెట్టిన ఈ-పాస్ విధానం విజయవంతమైందని, దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని, రేషన్ డీలర్ల కమీషన్ పెంచి గౌరవంగా బతికేలా చూస్తామని ఈటెల పేర్కొన్నారు.
ఎక్కువమందికి లబ్ధి చేకూరేలా గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితిని రూ.60 వేలనుండి లక్షన్నరకు పెంచామని, పట్టణ ప్రాంతాల్లో రూ. 75 వేలనుండి రూ. 2 లక్షలకు పెంచామన్నారు. బియ్యం రవాణాలో అక్రమాలు జరగకుండా జీపీఎస్ సిస్టం ప్రవేశపెట్టనున్నట్లు, డీలర్లతో సహా ఎవరు అక్రమాలకు పాల్పడినా జైలుకు వెళ్లక తప్పదని ఈటెల హెచ్చరించారు. బియ్యం రీసైక్లింగ్ ను అడ్డుకోవాలని, పదేపదే నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం పౌరసరఫరాల శాఖ కమిషనర్ రజత్ కుమార్ మాట్లాడుతూ బియ్యం పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడానికి అధికారులంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. నిర్లక్ష్యం, నిర్లిప్తత విడిచిపెట్టి ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరేలా కృషి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు.