మే నెల 2,3,4 తేదీల్లో నాగార్జునసాగర్ లో ఆస్కికి చెందిన విషయ నిపుణులతో టీఆర్ఎస్ శిక్షణా తరగతులు జరగనున్నాయి. పాలనలో కీలక అంశాలపై పార్టీ ప్రజాప్రతినిధుల్లో అవగాహన కల్పించేందుకు రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ శిక్షణలో ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, బడ్జెట్, అడవులు, పరిశ్రమలు, శాంతిభద్రతలు, చట్టసభల సంప్రదాయాలు, కేంద్ర, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ, వర్తమాన రాజకీయాలు-మానవ సంబంధాలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, మంత్రులతో సమావేశమయ్యారు. ఏఏ అంశాలపై ఏఏ నిపుణులతో శిక్షణ ఇప్పించాలి? శిక్షణా శిబిరం నిర్వహణ ఏర్పాట్లు ఎలా ఉండాలి? అనే విషయాలపై సీఎం చర్చించారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు, నేతల స్థాయిని బట్టి ఎవరెవరు ఎప్పుడు శిబిరానికి హాజరు కావాలనే షెడ్యూల్ కూడా రూపొందించినట్లు సమాచారం.
శిక్షణా శిబిరంలో సీఎం కేసీఆర్ కూడా పాఠాలు చెప్పనున్నారని, ఆయనకు ఎంతో ఇష్టమైన రాజకీయం-మానవ సంబంధాలు అనే అంశంపై శిక్షణ ఇస్తారని తెలిసింది. ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కేసీఆర్ సూచనలు ఇవ్వనున్నారు. సీఎం కేసీఆర్ మే ఒకటో తేదీ సాయంత్రానికి సాగర్ చేరుకోనున్నారు. అదే రోజు సాయంత్రం కల్లా పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సాగర్ చేరుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మొదటి రెండు రోజులు(2,3 తేదీల్లో) శిక్షణ వీరికే పరిమితం అవుతుందని, జెడ్పీ చైర్ పర్సన్లు, మేయర్లు, డీసీసీబీ, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిలు 3వ తేదీ సాయంత్రానికి చేరుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నాలుగవ తేదీన శిక్షణా శిబిరాలు ముగుస్తాయి. ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ లింగ్డో, ప్రముఖ ఆర్ధికవేత్త హనుమంతరావు హాజరు కానున్నారు.