ఇదేమి రాజ్యం
ప్రజాస్వామ్యమా
ఫ్యామిలీ ప్రభుత్వమా
కోటరీ పరిపాలనా
ప్రధాని, కాబినెట్ ఏమైనారు
తోలు బొమ్మలై ఆడుతున్నారా
పార్లమెంటరీ పాలనకు
కాలం చెల్లిపోనున్నదా !
పార్లమెంట్,అసెంబ్లీలు
ప్రజల సమస్యల కచేరీలుకావా
రచ్చబండలా, పాలోల్ల పంచాయతీలా
మంత్రులు, ఎమ్మెల్లేలు
ప్రజాప్రతినిధులుకారా
ఎనకటి నవాబులు, జాగీర్దారులా
ప్రభుత్వం ఎందుకు
ప్రజల సంక్షేమానికి కాదా
ఎమ్మెల్లేల ఎదుగుదలకా
మంత్రుల కుబేర ప్రస్థానానికా!
అభివృద్ది అంటే ఏమిటి
పడమటి దేశాల ‘హైటెక్’ అనుకరణా
కార్పొరేటు కంపెనీల మిలాఖత్ తో
దేశం, రాష్ట్రం సొమ్ములు
సంతలో అమ్ము కోవడమా
‘కిక్కు బ్యాకు’ లతో సొంత ఖజానాలు
పార్టీ ‘కాఫర్లు’ నింపు కోవడమా !
ఎలెక్షన్లంటే ఏమిటి
కుటుంబమో, మతమో,కులమో
ఏదో ఒక నిషా ప్రజలకు ఎక్కించడమా
దోచిన సొమ్ముతో జాతరనా
మళ్ళీ కొల్ల గొట్టుకోవడానికి
చేస్తున్న వర్క్ షాపులా, సెమినార్లా !
మన దేశపు లక్ష్యాలేమిటి
దేశ పురోగతి, ప్రజల సంక్షేమం కాదా
కుటుంబ పరిపాలనా
‘హిందూత్వ’ అధికారమా
కులాల నాయకత్వాలా
పరదేశాలతో పరుగు పందెమా!
మనం ఏ స్వామ్యంలో ఉన్నాము
కుటుంబ పరిపాలనా స్వామ్యమా
‘హిందూత్వ’ అభిమత స్వామ్యమా
కులాల ఆధిపత్య స్వామ్యమా
అసలు సిసలు ప్రజాస్వామ్యమా
ఇవన్నీ కలగలిపిన ఆయోమయమా!
ఏమై పోతున్నాము మనం
మన ప్రజాస్వామ్యం పులిని చూసి
నక్క పెట్టుకొన్న వాతలేనా
సంకీర్ణ ప్రభుత్వాల సంక్లిష్టంలో
కుటుంబ, మత, కులాల
కుహనా రాజకీయ కల్లోలంలో
మన ప్రజాస్వామ్యం సంకరమై పోతున్నదా
ఎటు వేపు వెళ్తున్నాము మనము
ఇది పురోగమనమా, తిరోగమనమా !
జే ఆర్ జనుంపల్లి