By – పి. అశోక్‌కుమార్ (ప్రణయ్ మిత్రమండలి కార్యదర్శి)
—
‘వెళ్లిపోయిన వాళ్లను గుర్తు పెట్టుకోవడం వేడుక కాదు ఒక యాగం – ఒక సుదీర్ఘ యుద్ధాన్ని కొనసాగించడం ’
ఆయన ఈ లోకాన్ని వదిలి పదిహేనేళ్లయినా ఆ చక్కని రూపం, చల్లని చూపు, వెచ్చని స్పర్శ ఇంకా ప్రజలు మర్చిపోలేదు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ పిలిస్తే పలికే నేతగా గుర్తింపు పొందిన ఆయనను ప్రజలు గుండెల్లో దాచుకున్నారు. వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ తెలంగాణ వెనుకబాటుతనాన్ని అసెంబ్లీలో లేవనెత్తిన తీరును తెలంగాణవాదులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. అవి 1996 సంవత్సరలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న రోజులు. సభలో ఓ వైపు నియంతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న చంద్రబాబునాయుడు. మరోవైపు స్పీకర్ స్థానంలో సీమాంధ్ర దురంహకారాన్ని నరనరాన జీర్ణించుకున్న యనమల రామకృష్ణుడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ దాస్యం ప్రణయ్‌భాస్కర్ మాట్లాడుతుండగా స్పీకర్ అడ్డుకున్నారు. తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించవద్దని హెచ్చరించారు. తెలంగాణ గురించి మాట్లాడాలంటే వెనుకబడిన ప్రాంతాలు అని మాట్లాడాలని, తెలంగాణ అనకూడదని తన నైజాన్ని చాటుకున్నారు.
కానీ ఓరుగల్లు మట్టి పౌరుషమో, కాళోజీ ధిక్కార వారసత్వమో, జయశంకర్ తెలంగాణ తెగువనో ప్రణయ్‌భాస్కర్ చెప్పదలుచుకున్నది చెప్పి ప్రభుత్వాన్ని నిలదీశారు. అయినా ప్రభుత్వంలో చలనం రాలేదు. దీనిని నిరసిస్తూ తన శాసన సభ్యత్వానికి ప్రణయ్ రాజీనామా చేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. మలిదశ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలో జరిగిన ఈ సంఘటన తెలంగాణవాదులకు స్ఫూర్తినిచ్చింది. ముఖ్యంగా రాజకీయ నేతలకు దిశానిర్దేశం చేసింది. వరంగల్ కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో గ్రామీణ ఛాయల్ని వదలని వడ్డేపల్లిలో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ప్రణయ్‌భాస్కర్ జన్మించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచే విద్యార్థి నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. అమరవీరుల స్థూపం డిజైన్ కోసం ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు ఏ.మదన్‌మోహన్, జయశంకర్‌సార్‌కు సన్నిహిత మిత్రుడు, 1969 ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న డాక్టర్ ఏ. గోపాలకిషన్ ఆయనకు మేనమామలు.
రాజకీయాలలో ప్రవేశించిన తొలినాళ్లలో జిల్లాకు చెందిన ఓ ప్రముఖ నేత ప్రణయ్‌భాస్కర్‌ను పార్టీలో తనకు పోటీగా భావించి విద్యాధికులు మాత్రమే రాజకీయాల్లో రాణిస్తారని, నీకు విద్యార్హతలు లేవని అవమానపర్చాడు. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకుని రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూనే నాలుగు పోస్టుగ్రాడ్యుయేషన్ డిగ్రీలు, న్యాయవాద పట్టా పుచ్చుకుని తన సత్తా చాటుకున్నారు. 1994లో హన్మకొండ శాసనసభా స్థానానికి జరిగిన ఎన్నికల్లో నాటి ప్రధాని పీవీ నర్సింహారావు కొడుకు పీవీ రంగారావుపై ఘనవిజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత రాష్ట్ర క్రీడల మంత్రిగా రాష్ట్రమంతటా పర్యటించారు. ఆయన విజయం సాధించిన తరువాత వరంగల్ అభిమానులు నిర్వహించిన ర్యాలీ జిల్లా చరిత్రలోనే సంచలనం. తాను ఏ స్థాయిలో ఉన్నా బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలూ కృషి చేశారు. పార్టీలకు అతీతంగా అందరినీ చేరదీసి వారి సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందించారు. ఆయన పట్ల ప్రజలూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆరోజుల్లో చాలా మంది తమ పిల్లలకు ప్రణయ్ అని పేరుపెట్టుకున్నారు. కొందరు తాటి చెట్లకు ఆయన పేరుపెట్టుకుని మురిసిపోయారు. ప్రజాకవి కాళోజీ, జయశంకర్‌సార్ అంటే ఆయనకు ఎనలేని గౌరవం. ఎప్పుడూ వారితో తన అభిప్రాయాలను పంచుకునేవారు. ఆ సాన్నిహిత్యమే ఆయన అసెంబ్లీలో తెలంగాణవాదాన్ని వినిపించడానికి ప్రేరణ అయ్యింది. అయితే తెలంగాణ ఉద్యమానికి పెద్దదిక్కుగా నిలిచిన ఓరుగల్లు ముద్దుబిడ్డ జయశంకర్‌సార్, డాక్టర్ బుర్రా రాములులాగానే ప్రణయ్‌భాస్కర్‌కూడా క్యాన్సర్ వ్యాధితో దూరం కావడం విషాదమయితే, పుట్టిన రోజునాడే మరణించడం మరో విషాదం. ఆయన మరణించినప్పుడు కన్నీళ్లు కార్చిన కాళోజీ.. ‘కాకులే ఎక్కువగా ఉన్న నేటి సమాజంలో కోకిల వంటి వాడు ప్రణయ్’ అన్నారు. వరంగల్ కలెక్టరేట్ నుంచి ప్రణయ్ చౌక్ దాటి ప్రణయ్‌మార్గ్ గుండా వెళ్తుంటే ఆయన జ్ఞాపకాలు వెంటాడుతాయి. ఆయన స్ఫూర్తి ముందుకు నడిపిస్తుంది.
(నేడు మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ జయంతి, 15వ వర్ధంతి)
(నమస్తే తెలంగాణ సౌజన్యంతో)