mt_logo

పంచాయతీల్లో గెలిచిన వారిని తమవారిగా ఎలా చెప్పుకుంటారు

గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిరాళ్లు. గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్‌. గ్రామానికి సంబంధించిన అన్ని పనుల్లో ముందుండి నడిపేవాడు సర్పంచ్‌. అతడికి గ్రామ ప్రజలందరూ సమానమే. సర్పంచ్‌ కూడా అందరివాడిలా వ్యవహరించాలి. ఎవరిపై పక్షపాతం చూపొద్దు. దేశాభివృద్ధికి పట్టుకొమ్మలైన గ్రామాలు బాగు పడేందుకు రాజకీయ పార్టీల ప్రమేయం లేని ఎన్నికల వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామంలో మంచి పేరున్న వ్యక్తులు, ప్రజలందరితో సత్సంబంధాలు ఉన్నవారు, అభివృద్ధికి దోహదపడే వారు గతంలో సర్పంచులుగా ఎన్నికయ్యేవారు. సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులకు రాజకీయ నేపథ్యమున్నా అదెక్కడా ప్రతిఫలించకుండా జాగ్రత్తపడేవారు. ఊరి వరకు వచ్చినప్పుడు రాజకీయాలతో సంబంధం లేకుండానే వ్యవహరించేవారు. సర్పంచ్‌తో ప్రజలు కూడా సత్సంబంధాలను కొనసాగించేవారు. ప్రజల్లో ఎంతటి రాజకీయ చైతన్యం ఉన్నా దానిని పంచాయతీల్లో మాత్రం ప్రదర్శించకపోయేవారు. అలాంటి పంచాయతీ ఎన్నికలను ఇప్పుడు అన్ని పార్టీలు బ్రష్టు పట్టించాయి. పంచాయతీల్లో సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలిచిన వారిని తమ పార్టీ వారు చెప్పుకోవడానికి పోటీ పడుతున్నాయి. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యం చాటుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు తహతహలాడుతున్నాయి. ఎన్నికలకు తావులేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలను తమ పక్షాన వేసుకోవడానికి చేయని ప్రయత్నాలు లేవు. ఒక్కో పార్టీ సర్పంచులను తమ వారు అనిపించుకోడానికి భారీగానే ఖర్చు చేశాయి. ఇక ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా సొంత ఇమేజ్‌తో ఏకగ్రీవమైనవారిని తమ పక్షానికి తిప్పుకోవడానికి అన్ని అస్త్రాలు సంధించాయి. అధికార పార్టీ నిధులెట్ల వస్తాయో చూస్తామంటే, ప్రతిపక్ష పార్టీలు రేపు తమదే అధికారం కాబట్టి అప్పుడు చూసుకుంటామంటూ బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగాయి. రాజకీయ పార్టీల ఒత్తిళ్లతో సర్పంచుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క చందంగా మారింది. ఏ రాజకీయ పార్టీకి జై కొడితే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో తెలియక, ఏ పక్షాన నిలువాలో అర్థం కాక నానా అగచాట్లు ఎదుర్కొంటున్నారు. ఏకగ్రీవం నుంచి తొలి విడత ఎన్నికల నాటికి పంచాయతీ సీన్‌ సమూలంగా మారింది. ఫక్తు రాజకీయ ట్రిక్కులు ఈ ఎన్నికల్లో బహిరంగంగా ప్రదర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు మెజర్‌ పంచాయతీలు, మండల కేంద్రాల్లో క్యాంపులు వేసి మరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో ఎప్పుడు పంచాయతీ ఎన్నికలకు ఈ స్థాయిలో మంత్రాంగం నడిపిన దాఖలాలు లేవు. అన్ని రాజకీయ పార్టీలు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, పోటాపోటీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిళాలు అందజేయడం, విందు రాజకీయాలు నడపడంతో ఒక్కో పంచాయతీలో ఎన్నికల ఖర్చు రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షలకు మించిపోయింది. ఒక్కో గ్రామంలో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటాపోటీగా డబ్బులు వెదజల్లారు. సగటున గెలుపొందిన అభ్యర్థి రూ.15 లక్షల వరకు ఖర్చు చేసినట్లుగా చెప్తున్నారు. ఒకప్పుడు గ్రామ సర్పంచ్‌ అంటే హోదా. ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఉండటం, గ్రామ ప్రథమ పౌరుడిగా అన్నింటా అగ్రపీఠం సర్పంచ్‌కే ఉండటంతో ఎన్నికల్లో మంచి పేరున్న అభ్యర్థులు పోటీపడేవారు. తాము గెలుపొందితే గ్రామంలో చేయబోయే మంచి పనుల గురించి చెప్పుకుంటూ ప్రచారం చేసే వారు. ఎన్నికలు ముగిసిన తర్వాత సర్పంచ్‌తో ఓడిపోయిన అభ్యర్థులు స్నేహంగానే మెలిగేవారు. గ్రామాభివృద్ధిలో వారూ భాగస్వామలయ్యేవారు. కానీ ప్రస్తుత ఎన్నికల్లో పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. పీఠంపై గురిపెట్టుకొని భారీగా ఖర్చు పెడుతున్న అభ్యర్థులు గెలిచిన వారిపైనో, మద్దతిస్తామని చెప్పి సహకరించకపోయిన వారిపైనో దాడులకు తెగపడుతున్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత దాడి ఘటనలు ప్రతి జిల్లాల్లోనూ దర్శనమిచ్చాయి. కొన్ని చోట్ల ఓటమి చెందిన వారు బ్యాలెట్‌ బాక్స్‌లను ఎత్తుకెళ్లిపోయారు. మరికొన్ని చోట్ల బ్యాక్సుల్లో ఇంక్‌ పోశారు. పోలింగ్‌ తేదీకి రెండు రోజుల ముందు వరకూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ రద్దు చేశారు కూడా. పోలింగ్‌ సమయంలోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ప్రకృతి సహకరించకున్నా ఓటర్లు ముందకొచ్చి స్థానిక ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటు వేశారు. ప్రతిసారి ఎన్నికల్లో చాలా చోట్ల ఓట్లు గల్లంతయ్యాయని నిర్వహించే ఆందోళనలు ఈసారి అంతగా కనిపించలేదు. అంటే ఓటర్లను చైతన్యవంతం చేయడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కొంత వరకు కృతకృత్యమైనట్టే. ఓటర్లలో ఇంతస్థాయి చైతన్యమున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు దివాళకోరు విదానాలు పాటించాయి. ఆ పార్టీల ప్రభావం ఓటర్లపై అంతగా కనిపించలేదు కాని ఎన్నికల తర్వాత పరిణామాలు గ్రామ స్వరాజ్యానికి, పంచాయతీ వ్యవస్థకే చేటు తెచ్చేలా పరిణమించాయి. ఈ దిగుజారుడు రాజకీయాలకు కొద్ది కాలం క్రితమే అంకురార్పణ జరిగినా ఈసారి అది తారస్థాయికి చేరింది. పార్టీల ప్రమేయం లేకుండా గెలిచిన వారిని తమ పార్టీ బలపరిచిన వారుగా చెప్పుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడ్డాయి. ఈ పోటీలో ప్రజాస్వామిక విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలిచ్చారు. అసలు పంచాయతీల్లో ఎన్నికైన వారు తమ పార్టీ వారు అనే చెప్పుకోవడమే మనం చేసుకున్న దౌర్భాగ్యానికి నిదర్శనం. పంచాయతీల్లో రాజకీయాలు జొప్పించడాన్ని అన్ని పార్టీలు మానుకుంటే మంచిది. అంతేకాదు పంచాయతీలకు నిధుల కేటాయింపులో కూడా ఎలాంటి పక్షపాతం వహించకుండా చూడాలి. అప్పుడే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు స్వార్థాన్ని వీడి మంచి మనస్సుతో ముందుకు రావాలి.