mt_logo

కొడుక్కే టికెట్‌ ఇప్పించుకోలేని నేత సీఎం అవుతాడట… జానారెడ్డిపై జోకులు….!!

 

తెలంగాణ కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదలయింది. 65మందితో కూడిన జాబితా అంతా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు కనిపిస్తోంది. అభ్యర్ధుల ప్రకటన సమయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జానా రెడ్డి, రేవంత్‌ రెడ్డి వంటి వారిని పిలిచి సంప్రదించింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. దీంతో, వారి కోరిన సీట్లు, వారి అనుచరగణానికి దక్కాల్సిన స్థానాలు పదిలంగా ఉంటాయని భావించారు.. ఊహించని విధంగా జానారెడ్డి, రేవంత్‌ రెడ్డి టీమ్‌కి మొండి చేయి ఎదురయింది. వారు కోరిన టికెట్‌లు దక్కకపోవడం కాంగ్రెస్‌లో పెను దుమారం రేపుతోంది.

థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ జానా రెడ్డి తన కొడుకు రఘు రెడ్డికి టికెట్‌ ఇప్పించుకోవాలని తెగ ప్రయత్నించారు. ఆయన కూడా ఢిల్లీ వెళ్లి హై కమాండ్‌తో ఇదే విషయం చర్చించారట. ఉత్తమ్‌ నిరాకరించడంతోపాటు కుటుంబానికి సింగిల్‌ టికెట్‌ అనే షరతు పెట్టుకున్నారని, దీని ప్రభావం కారణంగా జానా రెడ్డి తనయుడు రఘు రెడ్డికి జాబితాలో చోటు దక్కలేదని భావిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆయన భార్య పద్మావతికి టికెట్‌లు దక్కడం విశేషం. ఇటు మల్లు కుటుంబానికి సైతం రెండు టికెట్‌లు వచ్చాయి. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారుతోంది.. జానారెడ్డి వారసుడికే బెర్త్‌ దక్కకపోవడం ఏంటనే కామెంట్స్‌ మొదలయ్యాయి..

జానారెడ్డి సీనియర్‌ నేత. రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. ఈ దఫా కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం రేసులో ముందున్న నేత. అలాంటి జానారెడ్డి తన తనయుడికే టికెట్‌ ఇప్పించుకోలేకపోయారు. దీనిపై సోషల్‌ మీడియాలో సెటైర్‌లు పడుతున్నాయి. సీఎం అభ్యర్ధి తనయుడికే టికెట్ ఇప్పించుకోలేని నేతకు కాంగ్రెస్‌లో ఉన్న పరిస్థితి ఇదంటూ ఆయనను ట్రాల్‌ చేస్తున్నారు. మరోవైపు, ఇదంతా ఉత్తమ్‌ మార్క్‌ రాజకీయం అని, జిల్లాలో జానా వర్గాన్ని అణగదొక్కేందుకే కుట్ర పన్నారని, పాపం జానారెడ్డి ఆయన అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

జానారెడ్డిపై ఉత్తమ్‌ టీమ్‌ అధిష్టానానికి భారీగా ఫిర్యాదులు చేసిందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలలో సీఎల్‌పీ నేత అయిన జానారెడ్డి దూకుడుగా వ్యవహరించకుండా, టీఆర్‌ఎస్‌తో సన్నిహితంగా మెలిగేవాడని, కాంగ్రెస్‌ సీక్రెట్‌లను ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లీక్‌ చేసేవాడని హైకమాండ్‌ నేతలకు లీకులు ఇచ్చారట.. దీంతో, జానాకి ఝలక్‌ ఇవ్వడానికే ఇలా చేసినట్లు మరికొందరు చెబుతున్నారు.. ఏది ఏమైనా జానారెడ్డి హవా ముగిసిందనుకోవాలేమో కాంగ్రెస్‌లో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *