mt_logo

2018 ఎన్నికల్లో సెటిలర్లు తెలుగు దేశం పార్టీకి ఓటెయ్యరు

2014 లో ఎన్నికల్లో టిడిపి – బిజెపి కూటమికి అధిక సంఖ్యలో ఓట్లేసిన ఆంధ్ర, రాయల సీమ సెటిలర్లు ఈ ఎన్నికల్లో టీడీపీ కి ఓట్లేసే అవకాశం లేదు అని విశ్లేషిస్తూ శ్రీ BP Padala గారు పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ సోషల్ మీడియా లో చర్చనీయాంశం అయ్యింది. పడాల గారి విశ్లేషణను వారి మాటల్లో మీరే చదవండి.

‘‘తెలంగాణలోని సెటిలర్లు (ముఖ్యముగా ఆంధ్రా, రాయలసీమ ప్రాంత వాసులు) అందరూ అనుకున్నట్లుగా ఏకశిలా సదృశం ఏమీ కాదు… ప్రాంతాల వారీగా, కులాలవారీగా, మతాల వారీగా, పార్టీల వారీగా, ఐడియాలజీ వారీగా ఎన్నో చీలికలు… నిజాం కాలంలో వచ్చి అనేక పల్లెల్లో స్థిరపడిన మూడో తరం వారు, 1983 ముందు ఉద్యోగార్థం వచ్చి హైదరాబాద్లో రిటైర్ అయినవారు, 1983 తర్వాత వేవ్ లో ఉద్యోగ /వ్యాపార నిమిత్తం వచ్చిన వారు, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల నుంచి పనులు వెతుక్కుంటూ వచ్చిన కూలీలు., ఆంధ్రలో ఇంకా మూలాలు ఉన్నవాళ్లు, కమ్మ పల్లెలు, గుంటూరు పల్లెలు… 1983 తరువాత ఎన్టీయార్ హయాంలో కోస్తాంధ్ర జిల్లాల నుంచి వలసలు అధికం కాగా, 2004 తరువాత వైఎస్ హయాంలో సీమ జిల్లాల నుంచి అధికంగా వచ్చారు… కొలువులకు ఎప్పుడయితే హైదరాబాద్ ప్రధాన కేంద్రం అయ్యిందో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జిల్లాల వాళ్లు వచ్చి చేరారు… భిన్నమైన నేపథ్యం ఉన్నవాళ్లు…

1. తెలంగాణ జిల్లాల్లో మైనారిటీ గా ఉన్న కమ్మ వారు, మారిన రాజకీయ పరిస్థితిలో, మహాకూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనుకుంటే తప్ప తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న జిల్లాలో గంపగుత్తాగా టీడీపీకి వేసే ధర్యం చేయలేరు. పార్టీల బలాబలాలను తారుమారు చేసేంత పరిస్థితి లేదు

2. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలోని కమ్మ వారే టీడీపీకి కీలకం… అయితే తుమ్మల దౌత్యంతో, టీడీపీ నుండి మారిన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ తెరాస సీట్లు ఖరారు చేసిన నేపథ్యంలో, ఈ ఓట్లు టీడీపీ, తెరాస మధ్యన చీలిపోతాయి… అయితే మహాకూటమి విజయం తథ్యం అనుకుంటే మాత్రం కమ్మవారి ఓట్లు టీడీపీకి గంపగుత్తాగా పడే అవకాశం ఉంది… లేకపోతే GHMC ఫలితాలే పునరావృతమవుతాయి

3. సాంప్రదాయకంగా కమ్మలను వ్యతిరేకించే బ్రాహ్మణుల సహజ మొగ్గు బీజేపీ వైపు… లేదా యాగాలతో, సాష్టాంగ దండ ప్రమాణాలతో మెప్పించిన హిందూ హృదయ సామ్రాట్ కెసిఆర్ వైపు

4. రాజులూ, వైశ్యులు మొగ్గు ఎప్పుడూ బీజేపీ లాంటి జాతీయవాద పార్టీల వైపే

5. పవన్ కళ్యాణ్ ప్రభావం ఈసారి తెలంగాణలో కూడా గణనీయంగా ఉండిపోతుంది… కాపులే కాకుండా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలో నుండి వచ్చిన అన్ని కులాల యువత (పవన్ అభిమానులు) టీడీపీకి దూరంగా ఉంటారు… ఈ దిశగా పవన్ ని తెరాస వాడుకునేందుకు రంగం సిద్ధం చేసిందని వార్తలు

6. జగన్ బరిలో లేనందున రాయలసీమ రెడ్లు తెరాసకి లేదా కాంగ్రెస్ కు మాత్రమే వేస్తారు… టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ వేయరు… ఆంధ్ర, రాయలసీమ క్రిస్టియన్లు, కన్వర్టెడ్ క్రిస్టియన్లు కూడా టీడీపీకి వేసే అవకాశం ఎంత మాత్రం లేదు… ఇప్పటికే చర్చిల నుండి ఆదేశాలు వస్తున్నట్టుగా వార్తలు… రెడ్లు, దళితులు, క్రిస్టియన్స్ మొగ్గు జగన్ సూచించిన పార్టీ వైపే… అది ఏదో మనందరికీ తెలుసు

7. ప్రాంతం కంటే మతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే ఆంధ్ర, రాయలసీమ ముస్లిమ్స్ సహజంగానే మజ్లిస్ బలపరిచిన తెరాసకే మద్దతు ఇస్తారు

8. ఆంధ్ర, రాయలసీమ నుండి వచ్చి సెటిలైన బలహీనవర్గాల వారు (బీసీలు) వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేని సుహృద్భావ స్థితి తెలంగాణలో నెలకొని ఉన్నందున, తెరాసకి వ్యతిరేకంగా టీడీపీకి గంపగుత్తాగా ఓట్ వేసే అవకాశాలు లేవు

9. కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతిపరుల ఓట్లు కూడా సిపిఎం, సిపిఐ రెండు వర్గాలకు చీలిపోయింది

సో, ఏతావాతా సెటిలర్లు అందరూ చంద్రబాబు ఎటు మొగ్గితే అటు అనే స్థితి ఏమాత్రం లేదు అని తేలుతుంది… అది గ్రేటర్ ఎన్నికల్లోనూ కనిపించింది… అంతేకాదు, ఇప్పుడున్నది ఎలాగూ ఉద్యమకాలంనాటి టీఆర్ఎస్ కాదు కాబట్టి, ఆ భయపూరిత ఓట్లు 2014లోలాగా కేసీఆర్ కు వ్యతిరేకంగా పడతాయా అనే స్థితి ఇప్పుడు అస్సలు లేదు… పలు పార్టీల నడుమ, పలు కారణాలతో ఈ వోట్లు చీలిపోవచ్చు… మీరేమంటారు..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *