mt_logo

కల్లోలం సృష్టిస్తున్న ‘అగ్నిపథ్’… సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తీవ్ర ఉద్రిక్తత

కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘అగ్నిపథ్’ రద్దు చేయాలని దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, ఆర్మీ అభ్యర్థులు తీవ్ర ఆందోళన తెలియజేస్తున్నారు. అగ్నిపథ్ రద్దు చేసి యథావిధిగా సైనిక ఎంపిక కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పలు రైళ్లకు నిప్పు పెట్టి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. గురువారం ఉత్తర భారతంలో జరిగిన అల్లర్ల ఉధృతి నేడు దక్షిణాది రాష్ట్రాలకు పాకింది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనకారులు స్టేషన్‌లో పలు రైళ్లకు నిప్పు పెట్టారు. స్టేషన్లో విధ్వంసానికి పాల్పడి, పోలీసులపై రాళ్లదాడికి దిగారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ఓ యువకుడు మృతిచెందాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. గాయపడిన వారిని గాంధీ దవాఖానకు తరలించారు. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ విధానంలో ఆర్మీకి ఎన్నికైన యువకులకు నాలుగేళ్లు ఆర్మ్డ్ ట్రైనింగ్ తర్వాత వారందరిలో కేవలం 25% మందిని మాత్రమే విధుల్లోకి తీసుకొని మిగతా వారిని ఇంటికి పంపించనున్నారు. దీనివల్ల వారంతా మళ్ళీ నిరుద్యోగులుగా మారనున్నారు. అందుకే ఈ విధానాన్ని రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థులు, నిరుద్యోగులు పోరాటాన్ని ఉదృతం చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *