రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ ప్రారంభానికి సిద్ధమవుతోంది. రోడ్లు, లైట్ల ఏర్పాటు పనులు దాదాపు పూర్తవగా.. వ్యర్థ జలాల శుద్ధి ప్లాంటు (సీఈటీపీ) నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వచ్చే నెలాఖర్లో ఫార్మాసిటీని ప్రారంభించేందుకు టీఎస్‌ఐఐసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో వేలాది ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఔషధ, పరిశోధన సంస్థలకు సంబంధించి ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ఎకోసిస్టంను ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. మొదటి దశలో భాగంగా ఇప్పటికే 9,212 ఎకరాల భూమిని సేకరించగా, 6,719 ఎకరాల్లో రోడ్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల ఏర్పాటు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తయ్యాయి. కేంద్రం ఇదివరకే ఈ ఫార్మాసిటీని నేషనల్ ఇండస్ట్రియల్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)గా గుర్తించింది. పర్యావరణ అనుమతులు సైతం మంజూరయ్యాయి. స్థలాల కేటాయింపు కోరుతూ 200లకుపైగా ఔషధ, పరిశోధన సంస్థలు టీఎస్‌ఐఐసీకి దరఖాస్తు కూడా చేసుకున్నాయి.
ఫార్మాకు కేరాఫ్ అడ్రెస్ హైదరాబాద్ :
ఔషధ రంగంలో హైదరాబాద్ నగరానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే దేశీయ ఔషధ ఉత్పత్తుల్లో మూడో వంతు మన రాష్ట్రం నుంచే ఉన్నందున నగరానికి ఫార్మా క్యాపిటల్‌గా ఖ్యాతి లభించింది. నగరంలో దాదాపు 300 ఫార్మా కంపెనీలు ఔషధాలను తయారు చేస్తున్నాయి. ఇందులో చాలా కంపెనీలు యూఎస్‌ఎఫ్‌డీఏ గుర్తింపు పొంది అమెరికా, ఐరోపా దేశాలతోపాటు ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనా ప్రోద్భలంతో ఫార్మా రంగం మరింత అభివృద్ధి లక్ష్యంతో పర్యావరణ హిత పరిశ్రమలను నెలకొల్పడానికి అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ముచ్చెర్ల ఫార్మాసిటీ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. కాగా ఈ ఫార్మాసిటీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే..దాదాపు 64,000 కోట్ల పెట్టుబడులు రానుండగా.. 58,000 కోట్ల వార్షిక ఎగుమతులు జరగనున్నాయి. అలాగే 5 లక్షలకు పైగా ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మొత్తానికి నిమ్ట్ వలన మన రాష్ట్రం ప్రపంచ ఔషధ హబ్‌గా మారనుంది.