చైనాలో సెప్టెంబర్ 9 నుండి 11 వరకు జరిగే న్యూ ఛాంపియన్స్-2015 సదస్సులో పాల్గొనాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ రోస్లర్ రాసిన లేఖ శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులెత్తిస్తున్న సీఎం పని విధానానికి సంబంధించిన అభిప్రాయాలను పంచుకోవడం సదస్సుకు గొప్ప విలువను తెచ్చిపెడుతుందని కేసీఆర్ కు రాసిన లేఖలో ఫిలిప్ రోస్లర్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణీకరణ, నూతన ఆవిష్కరణలతో కూడిన అభివృద్ధి తదితర అంశాలలో జరిగే చర్చలో సీఎం కేసీఆర్ అభిప్రాయాలు ఎంతో అవసరమని తాము అభిప్రాయపడుతున్నామని, ముఖ్యమంత్రి తనవెంట వ్యాపార ప్రతినిధి బృందాన్ని కూడా తీసుకురావచ్చని ఆయన పేర్కొన్నారు.
వేగంగా పురోగమిస్తున్న సమాజంలో భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో 2015 సంవత్సరంలో తమ ప్రతిభాపాటవాలతో అద్భుత ఫలితాలు సాధించిన బహుళజాతి సంస్థలు, ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, మీడియా, పౌర సమాజాలకు చెందిన 1500 మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రధానంగా నూతన ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి అంశాలపై చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు ప్రపంచంలోని వివిధ దేశాలను ఆకర్షిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ విధానాల రూపకల్పనలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తోంది. ఈ అంశమే ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు ఆసక్తిగా చూసే పరిస్థితి ఏర్పడి అంతర్జాతీయ గుర్తింపుకు కారణమైంది.