mt_logo

త్వరలో ఛత్తీస్ గడ్-తెలంగాణ మధ్య విద్యుత్ లైన్ నిర్మాణం

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఛత్తీస్ గడ్ సీఎం రమణ్ సింగ్ శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రమణ్ సింగ్ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీరు తీసుకుంటున్న ముందస్తు చర్యలు, పనితీరు భేష్ అని సీఎం కేసీఆర్ ను ప్రశంసించారు. అత్యంత గడ్డు పరిస్థితి నుండి కోతలు లేని విద్యుత్ సరఫరా చేసే స్థితికి తెలంగాణ చేరుకోవడం మామూలు విషయం కాదని అన్నారు. తాను హైదరాబాద్ లో దిగగానే కారు డ్రైవర్ ను రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి ఏంటని ఆరా తీయగా, దానికి డ్రైవర్ స్పందిస్తూ ఇంతకుముందు తమ రాష్ట్రంలో కరెంట్ కు చాలా కష్టముండేదని, కేసీఆర్ సీఎం అయ్యాక కరెంట్ కష్టాలు తొలగిపోయాయని చెప్పాడని రమణ్ సింగ్ తెలిపారు.

కేసీఆర్ సీఎం అయ్యాక కరెంట్ కష్టాలు పోయాయని ఆ డ్రైవర్ చెప్పడంతో తాను చాలా సంతోషపడ్డానని, రోజుకు సగటున ఆరువేల మెగావాట్ల విద్యుత్ అవసరమయ్యే తెలంగాణలో కోతలు లేని విద్యుత్ సరఫరా చేయడం మామూలు విషయం కాదని ఆయన పేర్కొన్నారు. మీరు బాగా పనిచేస్తున్నారు.. మీది రిచ్ స్టేట్ కూడా.. మేము కూడా మీలాగే భవిష్యత్ లో తయారవుతాం, మంచి కార్యక్రమాలు చేస్తామని రమణ్ సింగ్ కేసీఆర్ తో చెప్పారు. అనంతరం ఛత్తీస్ గడ్ లోని నయా రాయపూర్ నిర్మాణ పురోగతిపై సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.

జల, సౌర విద్యుత్ ఉత్పత్తి, భవిష్యత్ ప్రణాళికలపై రమణ్ సింగ్ కేసీఆర్ తో చర్చించారు. ఇంతకుముందు చేసుకున్న ఒప్పందం మేరకు ఛత్తీస్ గడ్ నుండి తెలంగాణకు విద్యుత్ సరఫరాకు అవసరమైన లైన్ నిర్మాణ పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు తుమ్మల, కేటీఆర్, జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఢిల్లీలో అధికార ప్రతినిధి ఎస్ వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *