mt_logo

తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేసినట్లు?

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన అలుపెరుగని పోరాటంలో తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరక్టర్ దిలీప్ కొణతం నిర్వర్తించిన పాత్ర ఎనలేనిది.

మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో ఉద్యమానికి సంబంధించిన కవరేజ్ అతి తక్కువగా ఉన్న కాలంలో తెలంగాణ భావజాలవ్యాప్తి కోసం, ఉద్యమానికి సంబంధించిన వార్తలు, విషయాలు తెలంగాణ ప్రజలకు తెలియచేయడానికి దిలీప్ కొణతం సొంతంగా ఒక వెబ్‌సైట్ ప్రారంభించి దిగ్విజయంగా నడిపారు.. ఇంటర్నెట్‌లో కొన్ని లక్షల మందికి ఉద్యమ సమాచారాన్ని అందించారు. తన వ్యాసాలతో, విశ్లేషణలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదారు.

తెలంగాణ సాధన అనంతరం.. దిలీప్ తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం చేసే మంచి పనులను, పథకాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు చెరవేసే మహోత్తర బాధ్యతను తన భుజస్కందాల మీద వేసుకున్నారు.

తెలంగాణ డిజిటల్ మీడియా డైరక్టర్‌గా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మాజీ మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో తన టీంతో తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా ప్రాపర్టీలను ఎంతో నిబద్ధతతో, ప్రొఫెషనల్ పద్ధతిలో నడిపించారు. తెలంగాణ ప్రభుత్వ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అకౌంట్లను దేశంలోనే మొదటి వరుసలో నిలబెట్టారు.. జాతీయ స్థాయిలో పలు అవార్డులను కూడా అందుకున్నారు.

అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అకారణంగా దిలీప్ కొణతం మీద కక్ష గట్టింది. ప్రజల తరపున ప్రభుత్వం మీద పదునైన విమర్శలు చేస్తున్నాడని దిలీప్‌ని వేధించడం మొదలుపెట్టింది.

మే నెలలో ఒక ప్రముఖ మీడియా సంస్థ ఆర్టీసీ లోగో గురించి తన సోషల్ మీడియా అకౌంట్‌లో వేసిన ఒక న్యూస్‌ను షేర్ చేసినందుకు దిలీప్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అక్రమ కేసు పెట్టింది.. ఈ కేసు విషయంలో తన కారు డ్రైవర్‌ని సైతం వేధించింది. చివరకి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో కాంగ్రెస్ పార్టీ కుటిల వ్యూహం బెడిసికొట్టింది.

ఆ తర్వాత.. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఒక అక్రమ కేసు వేసినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో దిలీప్ వెనుకంజ వేయలేదు. దిలీప్ గొంతు నొక్కాలని కాంగ్రెస్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

చివరకి ఈరోజు మధ్యాహ్నం పోలీసులు మళ్ళీ దిలీప్ ఇంటి తలుపు తట్టారు. ఆయనను అరెస్ట్ చేసి బషీర్‌బాగ్‌లోని సీసీఏస్ కార్యాలయానికి తీసుకెళ్లారు.

ఎటువంటి ఎఫ్ఐఆర్, కేసు లేకుండానే పోలీసులు దిలీప్‌ని పోలీసులు అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర సీనియర్ నాయకులు కూడా ఆయన అరెస్టును తీవ్రంగా ఖండించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, జర్నలిస్టులపై దాడులు, ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెరిగిపోయాయి అని ప్రజాస్వామికవాదులు మండిపడుతున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే దిలీప్ కొణతంను అరెస్టు చేశారని సోషల్ మీడియాలో విమర్శలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో.. దిలీప్ కొణతం అక్రమ అరెస్టును ముక్తకంఠంతో ఖండించాల్సిన బాధ్యత ప్రతీ తెలంగాణవాదిపైన ఉంది. ఆయనను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలు ప్రజాస్వామ్యానికి, తెలంగాణ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు.

ప్రశ్నించే గొంతుకలపై పెడుతున్న ఈ అక్రమ కేసులు, అరెస్టులపై గొంతెత్తుదాం.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటుదాం.

జై తెలంగాణ!