mt_logo

దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చి గ్రామాలను మున్సిపాలిటీల్లో కలపడమేంటి: ఎమ్మెల్యే వివేకానంద

అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా 51 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడమేమిటి? దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చి గ్రామాలను మున్సిపాలిటీల్లో కలపడం ఏమిటి అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేపీ వివేకానంద మాట్లాడుతూ.. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు లోపల, బయట ఉన్న 51 గ్రామ పంచాయతీలను శివారు మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నాం. 51 గ్రామాలను శివారు మున్సిపాలిటీల్లో కలపాల్సిన తొందర ఏమొచ్చింది అని అడిగారు.

ఇంత పెద్ద నిర్ణయాన్ని హడావిడిగా ఎందుకు తీసుకున్నారు.. ఎవరితో చర్చించారు? సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత, అసమర్ధ నిర్ణయాలతో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటోంది. కనీసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా 51 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడమేమిటి? అని ప్రశ్నించారు.

ఇంత మంది ఎమ్మెల్యేలం ఉన్నాం.. మాతో చర్చించరా.. మున్సిపల్ శాఖ సీఎం దగ్గరే ఉంది.. ఎవరితో మాట్లాడకుండా నిర్ణయం తీసుకుంటారా.. కనీసం అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చించకుండా నిర్ణయం తీసుకుంటారా? సీఎంకు అవగాహన లేకపొతే వేరొక్కరికి మున్సిపల్ శాఖ అప్పగించాలి అని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ప్రజాపాలన పోయి ఆర్డినెన్స్‌ల పాలన వచ్చింది  సీఎంకు ఆశ ఎక్కువైంది.. అంతా తన నియంత్రణలో ఉండాలనుకుంటున్నారు.. కేంద్రీకృత వ్యవస్థను సీఎం ప్రవేశ పెడుతున్నారు. సీఎం దురాశ దుఃఖానికి చేటు అవుతుంది అని అన్నారు.

ఓఆర్ఆర్ లోపల మున్సిపాలిటీలను కలిపి హైదరాబాద్ మహా కార్పొరేషన్ చేయాలని జూలైలో సర్క్యూలర్ జారీ చేశారు.. దానికి విరుద్ధంగా ఇపుడు నిర్ణయం వచ్చింది. సీఎం తీరుతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఆదాయం నెలకు 300 కోట్ల రూపాయల మేర తగ్గింది. టోకెన్లు తీసుకున్న వారు సైతం రిజిస్ట్రేషన్లు చేసుకోవడం లేదు అని వివేకానంద విమర్శించారు.

కేసీఆర్ హయాంలో శివారు మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పాటు చేసుకుని అభివృద్ధికి బాటలు వేశాము. మౌలిక సదుపాయాలు కల్పించకుండా శివారు గ్రామాలు హైదరాబాద్‌తో సమానంగా పన్నులు కట్టాలా? ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నైలు వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధించాయి. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో హడావుడిగా కలపడం వల్ల ప్రజలపై భారమే తప్ప లాభం లేదు అని అన్నారు.

దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చి గ్రామాలను మున్సిపాలిటీల్లో కలపడం ఏమిటి? టోక్యో లాంటి నగతంలో 22 మున్సిపాలిటీలు ఉన్నాయి. సర్పంచ్‌ల కాలపరిమితి ముగిశాక, గ్రామసభల్లో నిర్ణయం తీసుకోకుండా నిర్ణయాలు ఏమిటి. సీఎం తప్పుడు నిర్ణయాలతో హైదరాబాద్ ప్రతిష్ట మసకబారుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

హైడ్రా పేరుతో వసూళ్ల కార్యక్రమం జరుగుతోంది.. కూల్చివేతలకు ఏ గైడ్‌లైన్స్ లేవు. సీఎం అనాలోచిత చర్యలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది. వేరే నగరాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెళ్లిపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ గ్రేటెస్ట్ నగరం కావాలి.. మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనాన్ని వెంటనే ఆపాలి అని డిమాండ్ చేశారు.

ఈ అంశంపై వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి.. దీనిపై లోతైన చర్చ జరగాలి. కేబినెట్ సబ్ కమిటీ తూతూ మంత్రంగా పనిచేసి కాంగ్రెస్ నేతల అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంది. కేబినెట్ సబ్ కమిటీ సమావేశాలకు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని దుయ్యబట్టారు.

2053 చదరపు కిలోమీటర్ల పరిధి గల కార్పొరేషన్‌తో కేంద్రీకృత వ్యవస్థ ఏర్పడితే ప్రజలకు నష్టం..సీఎంకు పాలనా అనుభవం లేక ప్రజలకు కష్టాలు. కాంగ్రెస్‌కు నిర్ణీత వ్యవధిలో మున్సిపల్ ఎన్నికలు పెట్టే అలవాటు లేదు అని వివేకానంద అన్నారు.