mt_logo

కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయి: హరీష్ రావు

అత్యాచారయత్నానికి గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనూరు ఆదివాసీ బిడ్డను పరామర్శించిన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. జైనూర్‌లో జరిగిన సంఘటన అత్యంత పాశవికమైన ఘటన.. చాలా దారుణంగా అత్యాచార యత్నం చేసి రాయితో ముఖం మీద దాడి చేశారు అని అన్నారు.

ఈ రాష్ట్రంలో అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యయి.. మొన్న నాగర్‌కర్నూల్‌లో చెంచు మహిళ మీద అత్యాచార యత్నం.. ఎల్బీనగర్‌లో నాలుగు సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచార యత్నం.. పెద్దపల్లిలో ఆరు సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచార యత్నం.. భూపాలపల్లిలో పోలీసు కానిస్టేబుల్ మీద ఎస్సై అత్యాచార యత్నం.. నల్లగొండ జిల్లాలో దివ్యాంగ మహిళ మీద అత్యాచార యత్నం.. ఈ ప్రభుత్వం వచ్చాక లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది అని దుయ్యబట్టారు.

9 నెలల కాంగ్రెస్ పాలనలో 1900 అత్యాచారం కేసులు నమోదయ్యాయి.. సబిత గారు అసెంబ్లీలో మాట్లాడితే మహిళలకు భద్రత కరువైందంటే మరుసటి రోజే హైదరాబాద్‌లో నాలుగు అత్యాచారాలు జరిగాయి అని అన్నారు.

ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నది.. కేసీఆర్ హయాంలో రక్షణకు కేరాఫ్ అడ్రస్‌గా రాష్ట్రాన్ని మార్చారు. కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం.. కేంద్ర హోం మంత్రి తెలంగాణను మెచ్చుకున్నారు.. భద్రతా సలహాదారు కూడా తెలంగాణను మెచ్చుకున్నారు అని గుర్తు చేశారు.

పోలీసు గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ సేఫ్టేస్ట్ సిటీ అని చెప్పారు.. కాని ఈరోజు రాష్ట్రం ఎటుపోతున్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీస్తున్నరు. ఈ నగరానికి ఏమైందని పత్రికలు రాస్తున్నాయి అని విమర్శించారు.

ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో 1900 అత్యాచారాలు, 2600 హత్యలు, 230 స్మగుల్డ్ వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. బీహార్లో ఉండే నాటు తుపాకులు తెలంగాణకు ఎలా వస్తున్నాయి.. నాటు తుపాకులు రాజ్యమేలుతున్నాయి అని హరీష్ రావు మండిపడ్డారు.

కేసీఆర్ హయాంలో చివరి ఐదేళ్లలో 200 స్మగుల్డ్ వెపన్స్ సీజ్ చేస్తే, కాంగ్రెస్ వచ్చిన 9 నెలల్లో 230 స్మగుల్డ్ వెపన్స్ సీజ్ అయ్యాయి. నాటు తుపాకులు రాజ్యమేలుతున్నాయి. లా అండ్ ఆర్డర్ కుప్పకూలింది.. రాష్ట్ర క్రెడిబిలిటీ దెబ్బతీస్తున్నారు అని ధ్వజమెత్తారు.

కొత్త డీజీపీ వచ్చిన రెండు నెలల్లో నాలుగు మత కలహాలు జరిగాయి. నిర్మల్, సనత్ నగర్, గోషామహల్, జైనూర్‌లో మతకలహాలు జరిగాయి.. సిస్టం మొత్తం కొలాప్స్ అయ్యింది అని అన్నారు.

సరైన అధికారిని సరైన స్థానంలో పెట్టాలి.. మెదక్ జిల్లాలో మత కలహాలు జరిగితే ఎస్పీ సరిగ్గా పని చేయలేదని ట్రాన్స్‌ఫర్ చేశారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా ప్రమోషన్ ఇచ్చారు. మీరు ప్రమోషన్ ఇస్తున్నరా, డిమోషన్ ఇస్తున్నరా అని అడిగారు.

కేంద్ర హోం శాఖను కోరుతున్నాం.. రాష్ట్రంలో మహిళా భద్రత కరువైంది. కేంద్రం జోక్యం చేసుకోవాలి.. స్పందించాలి.జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలి. మహిళలపై దాడులు నిత్యకృత్యం అయ్యాయి అని విమర్శించారు.

డయల్ 100 పని చేయడం లేదు.. పోలీసులను వారి పని వారు చెయ్యనివ్వడం లేదు.. జర్నలిస్టుల మీద దాడులు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. దేశంలోనే టాప్ మన పోలీసులు. వారిని ఇతర కార్యక్రమాలకు వాడుతున్నారు అని వాపోయారు.

ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యారు.. విపత్తు సాయం చేయడంలో ఫెయిల్.. రుణమాఫీ చెయ్యడంలో ఫెయిల్.. విద్య వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్.. హోం మంత్రిగా ఫెయిల్.. ముఖ్యమంత్రిగా ఫెయిల్.. రెండు హత్యలు, మూడు మానభంగాలు అన్నట్లు అయ్యింది అని ఫైర్ అయ్యారు.

ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల మీ అక్రమ కేసులు పెట్టుడు, కండువాలు కప్పడంలో బిజీ ఉన్నడు సీఎం.. పరిపాలన మీద దృష్టి సారించడం లేదు అని విమర్శించారు.

ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఎన్కౌంటర్ జరగటం ఆరుగురు చనిపోవడం చూశాం. కేసీఆర్ గారి పాలనలో ఎన్కౌంటర్లు జరిగాయా.. దశాబ్ద కాలంలో ఒక్క బుల్లెట్ సౌండ్ వినిపించలేదు.. కాంగ్రెస్ వచ్చింది మళ్లీ ఎన్కౌంటర్ల సంస్కృతి తెచ్చింది అని ఆరోపించారు.

పేరుకే ప్రజాపాలన.. అన్ని నిర్బంధాలే.. జైనూరులో ఆదివాసీ బిడ్డకు జరిగిన దారుణాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.. ప్రభుత్వం స్పందించాలి. వెంటనే రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి అని డిమాండ్ చేశారు.

సీఎం హైదరాబాద్‌లో ఉండి గాంధీ ఆసుపత్రికి వచ్చి చూసే టైం దొరకడం లేదా.. ఇంద్రవెల్లికి పోయి పెద్ద పెద్ద మాటు చెప్పినవు. గిరిజన మహిళ అత్యాచారానికి గురై చావు బతుకుల్లో ఉంటే పరామర్శించే సమయం లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు.

మీరే హోం మంత్రి, మీరే గిరిజన మంత్రి పట్టించుకోవడానికి.. సమయం లేదా. మానవీయ పాలన అంటే ఇదేనా, పరామర్శకు కూడా వారు నోచుకోలేదా. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వారి పనులను వారు చేసుకోనివ్వాలని కోరుతున్నాం అని అన్నారు.