mt_logo

మేమెక్కడ? మీరెక్కడ?

By: సవాల్ రెడ్డి

బ్రిటిష్‌వాళ్లు దేశాన్ని పాలిస్తున్న కాలంలో 1919 మాంటెగో-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల్లో భాగంగా 1920లో దేశవ్యాప్తంగా తొలిసారి ఎన్నికలు జరిగాయి. నాటి బ్రిటిషిండియాలో ఉన్న మద్రాస్

ప్రెసిడెన్సీలో ఇవాల్టి ఆంధ్రప్రాంతం ఓ భాగం. ఆ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి ఆంధ్రుడే. అంటే కాస్త అటు ఇటుగా ఆంధ్రప్రాంతంలో వందేండ్లనుంచే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారన్న మాట! అదే ప్రాంతంలో ఇవాళ రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలు వేసిన మూడు ఓట్లు మురిగిపోయాయి. అదే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఓటూ మురిగిపోలేదు.

ఒకనాడు తెలంగాణను అడ్డగోలు మాటలు మాట్లాడారు. తెలివి లేదన్నారు. సదువు రాదన్నారు. వ్యవసాయం తెలియదన్నారు. రాష్ట్రం వచ్చినా పాలించడం చాత కాదన్నారు. శిక్షణ ఇచ్చి మరీ వేయించిన ఓట్లు మురిగిపోయినందుకు వాళ్లంతా ఇపుడు తలలెక్కడ పెట్టుకుంటారో మరి..

తెలంగాణను అడుగడుగునా అవమానించిన వాళ్లున్నారు. ఒకడు తొండలు గుడ్లు పెట్టేవి కాదంటే.. ఇంకొకడు తలలు ఎక్కడ పెట్టుకుంటారని విర్రవీగాడు. బీడీ ముక్కలతోనూ, ఫ్రెజర్ కుక్కర్లతోనూ పోల్చారు. తెలంగాణ వస్తే హైదరాబాద్ ఖాళీ అవుతుందన్నవాళ్లు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టును బస్‌స్టాండు చేసుకోవాలి అన్నవాళ్లూ ఉన్నారు. ఖాళీ అయిందెవరో తెలిసి ఉండాలి. తెలంగాణవాళ్లకు భాషరాదని, ప్రమాణం చేయడం రాదన్నవాళ్లూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే ప్రమాణ దృశ్యాలను ప్రసారం చేసి అవమానించిన సందర్భాలున్నాయి. అదే పొరుగు రాష్ట్రంలో విజినరీగారి పుత్రరత్నం ప్రమాణపత్రంలోని పదాలు పలుకలేక లైన్లకు లైన్లు మింగేశాడు. అదే రాష్ట్రంలో క్యాబినెట్‌లోని 70శాతం మంత్రులకు సార్వభౌమాధికారం అనడమే చేతకాలేదు. మరి వాళ్ల భాషా పాండిత్యం ఏమైందో? చదువులు ఏ గంగలో కలిశాయో?

తెలంగాణ ఫ్యూడల్ పాలనలో మగ్గింది. మేం బ్రిటిషిండియాలో నాగరీకులమయ్యాం. పాలనలో ఆరితేరాం అని చెప్పుకు తిరిగారు. వందేండ్ల క్రితం ఓట్లు వేసిన ఆ ప్రాంతంవారు ఇవాళ రాష్ట్రపతి ఎన్నికలో ఓట్లు వేయడం చాతకాక మూడు ఓట్లు మురుగపెట్టుకున్నారు. కానీ ఫ్యూడల్ రాజులపాలన చూసిన ఇదే తెలంగాణ ఒక్క ఓటూ వృథాకాకుండా వందకు వందశాతం సంపూర్ణం చేసింది. వందేండ్ల అనుభవం ఏమైనట్టు? నిప్పులో కాల్చితేనే బంగారం నిగ్గు తేలుదంటారు. రాష్ట్ర విభజన జరిగి మూడేండ్లయింది. రెండు రాష్ట్రాలు వేటికవే తమ పాలనను సాగించుకుంటున్నాయి. ఇవాళ తెలంగాణ ఎక్కడుంది? వాళ్ళెక్కడున్నారు? ఇక్కడి పాలన ఎలా ఉంది? అక్కడి పాలన ఎలా ఉంది? ఇక్కడి రాజకీయం ఎలా ఉంది? అక్కడి రాజకీయం ఎలా ఉంది?

తెలంగాణ తన లక్ష్యసాధన దిశలో దూసుకుపోతున్నది. ఇవాళ తెలంగాణ రైతు సంక్షేమంలో, అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్. నీటి వనరుల కల్పనకు భారీ ప్రాజెక్టులను వేగంగా నిర్మిస్తున్నది. పెండింగ్ ప్రాజెక్టులను దాదాపు పూర్తి చేసింది. రైతులకు ఎరువులు, విత్తనాలు పుష్కలంగా అందిస్తున్నది. 24 గంటల కరెంటు అమలు ప్రారంభించింది. రేపు ఎకరానికి 8వేల పెట్టుబడి అందించనున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతు ప్రథమశ్రేణి పౌరుడుగా మారుతున్నాడు. దేశమంతా అన్నదాతలు ఆత్మహత్యలు, నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతున్న వేళ ఇది అపూర్వం. మిషన్ భగీరథ పూర్తి కావస్తున్నది. మిషన్ కాకతీయ ఫలితాలు కండ్ల ముందు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. విద్యారంగంలో గురుకులాల ప్రయోగం జాతీయస్థాయి ఎంపికలతో సఫలీకృతమవుతున్నది. విద్యుత్ రంగంలో అద్భుతాలు జరిగాయి. పాలనాసంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఒక్క సంతకంతో 31 జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజల చెంతకు పాలనను చేర్చింది. అభివృద్ధిలో, సంక్షేమంలో, శాంతిభద్రతల్లో, ఆదాయవృద్ధిలో, పన్ను వసూళ్లలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో, శ్రేష్ఠ్ భారత్‌లో, డిజిటల్ లావాదేవీల్లో, మొక్కల పెంపకంలో ఇలా అనేక రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఒక్క మాట లో చెప్పాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే ఆదర్శవంతమైన నమూనా రోడ్‌మ్యాప్ ఎలా ఉంటుందో ఇవాళ తెలంగాణలో అమలు చేసి చూపిస్తున్నారు.

ఈ మూడేండ్ల వ్యవధిలో తెలంగాణ తానేంటో నిరూపించుకుంది. పాలన ఎవరికి చాతనవుతుందో చేసి చూపించింది. ఎవరికి నాగరీక లక్షణాలు ఉన్నాయో చూపించింది. తెలుగు భాష మా పెరట్లో పుట్టిందన్నవాళ్లు తెలుగు ప్రాచీనత విషయంలో నీరుగారితే తెలంగాణ చరిత్ర తవ్వితీసి ప్రాచీనత సాధించింది. పాలన అంటే ఏమిటో ప్రగతి అంటే ఏమిటో తెలంగాణ తేల్చి చెప్పింది. గత వానకాలం యాసంగిలో ఇక్కడ పండిన పంటలు చెప్తున్నాయి. ఆ పంటల కొనుగోలుకోసం ఆంధ్రనుంచి క్యూ కడుతున్న లారీలు చెప్తున్నాయి. తెలంగాణ ఏం సాధించిందో నవ్విన నాపచేనే పండిందన్న ఆ ప్రాంతపు సామెతను అదే ప్రాంతానికి పాఠంగా చెప్పింది మన తెలంగాణ.

ఈ మధ్యే ఓ టీవీ సినిమా చిట్‌చాట్‌లో ఓ తెలంగాణ నిర్మాతను యాంకరమ్మ అడిగింది..మీరు అనేక సినిమాలు తీసినా ఎపుడూ మీ ప్రాంతాన్ని చూపించేవారు కాదు. ఈసారి ఏకంగా తెలంగాణ అమ్మాయి కథాంశంతో తీశారేమిటి? అని. ఆయన చెప్పిన సమాధానం…నిజమే. ఇంతకాలం సినిమాల్లో తెలంగాణ అంటే విలన్లు.. జోకర్లు.. లేకుంటే రెడ్ నేపథ్యమే చూపించారు. ఇపుడు నేను తెలంగాణను భిన్నంగా చూపిస్తున్నా.. బాగా చదువుకున్న, తెలివైన, డామినేటింగ్ నేచర్ ఉన్న తెలంగాణ అమ్మాయి ప్రేమకథను తీస్తున్నా.. అన్నాడు. అవును.. తెలంగాణ మీద సినిమారంగం అభిప్రాయమే కాదు.. అన్ని రంగాల అభిప్రాయం మారక తప్పదనడానికి ఇది సంకేతం కావచ్చు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *