mt_logo

తెలంగాణ అభివృద్ధికి ప్రవాస తెలంగాణీయులు కలిసి రావాలి: కేటీఆర్

రాష్ట్ర ఐటీ, పురపాలక మరియు పరిశ్రమల శాఖా మాత్యులు శ్రీ కల్వకుంట్ల తారకరామా రావు గారి అమెరికా పర్యటన సందర్బంగా తెలంగాణ రాష్ట్ర సమితి – యు.ఎస్.ఏ విభాగం ఆధ్వర్యంలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్ వ్యాలీలో ఘనంగా సభ నిర్వహించారు. ముందుగా తెలంగాణ ఉద్యమ అమరులకు నివాళులర్పించి దివంగత జయశంకర్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ విద్యాసాగర్ రావుకు శ్రద్ధాంజలి ఘటించారు.

అభిలాష్ రంగినేని స్వాగతోపన్యాసంతో విచ్చేసిన అతిధిలకు స్వాగతం పలికి గతః మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి వివరించారు.

తెరాస – యు.ఎస్.ఏ వ్యవస్థాపకులు తన్నీరు మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్నఅభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు విస్త్రుత ప్రచారం కలిపిస్తున్నామని అన్నారు. అమెరికాలో వున్న అన్ని సంఘాలతో సమన్వయంతో పనిచేస్తూ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తామన్నారు.

పూర్ణ బైరి సభకు అధ్యక్షత వహించారు. పూర్ణ బైరి మాట్లాడుతూ ఐటీ శాఖకు వన్నె తెచ్చిన మంత్రి మన కేటీర్ గారని అమెరికాకు వచ్చిన ప్రతిసారి తన వాక్చాతుర్యంతో వేల కోట్ల పెట్టుబడులతో తిరిగివెళ్ళి నిరోద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నారన్నారు.

చందు తాళ్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పదవిని త్వజించి తెలంగాణ సాధననే ధ్యేయంగా 14 సంవత్సారాల పాటు ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాదించడం ప్రపంచ చరిత్రలోనే అపూర్వ ఘట్టమని, నేడు రైతన్నకు తోడుగా ఎకరానికి ఎనమిది వేల రూపాయలు అందించడం యావత్ దేశానికి ఆదర్శమన్నారు.

భారీగా హాజరైన సభికులను ఉద్దేశించి కే.టీ.ర్ గారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి ప్రవాస తెలంగాణీయులు కలిసి రావాలని కోరారు. ఖమ్మం జిల్లాలో ఐటీ మరియు బీపీఓ పరిశ్రమ ఏర్పాటుకు జిల్లాకు చెందిన ఎన్నారైలు ముందుకు వచ్చారని అదే స్పూర్తితో ఇతర నగరాల్లో ఐటీ విస్తరణకు ప్రవాస తెలంగాణీయులు చొరవచూపించి ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేసి నిరోద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు చేయూత అందించాలని లేదా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇండియా డెవలప్ మెంట్ ఫండ్(ఐ.డి.ఎఫ్) ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పాటుఅందించాలని అన్నారు. ఐ.డి.ఎఫ్ ద్వారా ప్రవాసులు ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా అభివృద్ధి కార్యక్రమాలకే వెచ్చిస్తారన్నారు. ఇటీవల ఐ.డి.ఎఫ్ ద్వార సూర్యాపేట జిల్లాలో ఎన్నారైలు పనులు చేపట్టారని వివరించారు.

చేనేత కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగు నింపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా తెరాస కార్యకర్తలు చేనేత వస్త్రాలు ధరించి సభలో పాల్గొన్నారు. ఎన్నారైల చేనేత వస్త్రధారణ పై కే.టీ.ర్ గారు ఆరా తీసి వారందరిని ప్రశంసించారు. వేల కిలోమీటర్లు దూరంలో వున్నాపార్టీ కార్యకర్తలు ఆత్మీయులని వారిచ్చే ప్రేరణ పార్టీకి ప్రభుత్వానికి వెయ్యి ఏనుగుల బలమని తెరాస – యు.ఎస్.ఏ కార్యకర్తలను కొనియాడారు. డల్లాస్ నగరం నుండి వచ్చిన కార్యకర్త శ్రీనివాస్ జన్మదినం సందర్బంగా సభ అనంతరం మంత్రి గారి సమక్షంలో కేక్ కట్ చేసారు.

తెలంగాణ కంటే కొద్దిగా ముందుగా పదమూడు సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఛత్తీస్గడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కుదురుకుంటుంటే సీఎం కెసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రగతిషీల, పురోగమన రాష్ట్రంగా మారిందన్నారు. ఎన్నో అపోహలు, విషప్రచారాలు, అనుమానాలు మధ్య మూడు సంవత్సరాల క్రితం ఏర్పడ్డ మన తెలంగాణ కెసిఆర్ గారి పటిష్ట నాయకత్వంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అవతరించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం, పార్లమెంట్ సీట్ల కోసం తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే భారతీయ జనతా పార్టీ రాష్ట్రం ఏర్పడిన పదకొండు నెలల పాటు అధికార విభజన జరపకుండా తాత్సారం చేసిందన్నారు.

ప్రభుత్వం శిశువు నుండి వృద్దాప్యం వరకు ప్రతి దశలో ప్రజలకు అండగా వుంటూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విదంగా సంక్షేమ రంగానికి పెద్ద పీట వేసిందని ఇచ్చిన హామీలే కాకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, విద్యార్థులకు సన్న బియ్యం, కెసిఆర్ కిట్, మిషన్ భగీరథ, అసంఘటిత రంగంలో డ్రైవర్లకు ప్రమాద భీమా లాంటి పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. సంక్షేమ రంగంలో మన రాష్ట్రం స్వర్ణ యుగాన్ని తలపిస్తుందన్నారు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలతో రాష్ట్రానికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. రాన్నున్న రెండు సంవత్సరాల్లో మొత్తం తెలంగాణలో ఉన్నఅన్ని చెరువులు పునరుద్ధరింపబడుతాయని నిరంతర విద్యుత్, రుణ మాఫీ, సాగు నీటి రంగంలో ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చి రైతులకు అండగా నిలిచామన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలతో రాష్ట్రానికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. పురపాలక శాఖ మంత్రిగా హైదరాబాద్ మరియు ఇతర నగరాలకు చేస్తున్న కృషిని వివరించారు. అనంతరం తెరాస – యు.ఎస్.ఏ జూన్ 25న నిర్వహించనున్న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల గోడ పత్రికను ఆవిష్కరించారు.

ఈ సమావేశానికి ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెరాస – యు.ఎస్.ఏ లాస్ ఏంజెల్స్ సభ్యులుఅనిల్ ఎర్రబెల్లి, హరిందర్ తాళ్లపల్లి, కలకుంట్ల చంద్రశేఖర్, రవి ధరణీపతి, నవనీత్, సంతోష్, విజయ్,జాన్, దయాకర్, శ్రీనివాస్ రెడ్డి, రమణ మరియు బే ఏరియా సభ్యులు నవీన్ జలగం,రజినికాంత్ కూసానం, భాస్కర్, శ్రీనివాస్ రిషికేష్ రెడ్డి, శశి దొంతినేని, శివ కాలేరు తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *