తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తుదిదశకు చేరుకున్నాక కూడా సీమాంధ్ర నేతలవల్ల తెలంగాణకు మరో అన్యాయం జరిగింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణకు ప్రతిపాదించిన భారీ ప్రాజెక్టును ఆంధ్రకు తరలించేలా సీమాంధ్ర మంత్రులు నీచమైన కుట్రలకు తెరలేపారు.
నాలుగు రాష్ట్రాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లను ఏర్పాటు చేయాలని అజెండాలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని జోర్హాట్, మధ్యప్రదేశ్ లోని భోపాల్, ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్, హర్యానాలోని కురుక్షేత్రలో వీటిని ఏర్పాటు చేయాలని కేబినెట్ నోట్ లో పొందుపరచారు. అజెండాను మార్చి మరీ తెలంగాణకు చెందిన భారీ ప్రాజెక్టును విజయవాడకు తరలిస్తూ నిర్ణయం తీసుకోవడం, అదీ ప్రధాని మన్మోహన్ సింగ్ సమక్షంలో ఈ అన్యాయం జరగడం తెలంగాణ ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సీమాంధ్ర మంత్రి కావూరి, ఇతర సీమాంధ్ర మంత్రులు ఎన్ఐడీ ప్రాజెక్టును ఆంధ్రకు తరలించేలా ప్రధానిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ప్రాజెక్టును విజయవాడకు మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.