రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్న వీఆర్ఏలతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వీఆర్ఏలకు ఇచ్చిన హామీల అమలుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని, త్వరలోనే వీఆర్ఏల సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు. ప్రభుత్వం, వీఆర్ఏలు వేర్వేరు కాదని, వీఆర్ఏలుం ఆందోళనలు విరమించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
తమ సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్‌కు వీఆర్ఏ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని మంత్రిని కోరామని వారు పేర్కొన్నారు. వీఆర్ఏల సమస్య 25 వేల కుటుంబాలతో ముడిపడి ఉందని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.