బీఆర్ఎస్ విలీనం, పోత్తులు మరియు ఇతర దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులు, మీడియా సంస్థలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీ పైన, విలీనం లాంటి ఎజెండాపూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలి, లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.
24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్రపథాన నిలిపాము అని తెలిపారు.
ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాము. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైంది అని పేర్కొన్నారు.
ఎప్పటిలానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది.. పోరాడుతుంది. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను దుష్ప్రచారాలని మానుకోవాలి. పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం… కానీ తలవంచం అని కేటీఆర్ అన్నారు.