mt_logo

రాష్ట్ర సంపదను తన సోదరులకు దోచిపెట్టే పనిలో రేవంత్ ఉన్నారు: క్రిశాంక్

అసలైన కుటుంబ పాలన, దండుపాళ్యం ముఠా రేవంత్ పాలనలో చెలరేగుతున్నాయని.. సీఎం రేవంత్ రాష్ట్ర సంపదను తన సోదరులకు దోచిపెట్టే పనిలో ఉన్నారు అని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మండిపడ్డారు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో క్రిశాంక్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ అమెరికా పర్యటన సందర్భంగా స్వచ్ బయోతో వెయ్యి కోట్ల రూపాయల ఒప్పందం అని పత్రికల్లో వార్తలు వచ్చాయి.. ఆ స్వచ్ బయో కంపెనీ రేవంత్ రెడ్డి సొంత కుటుంబానిది అని పేర్కొన్నారు.

అసలైన కుటుంబ పాలన, దండుపాళ్యం ముఠా రేవంత్ పాలనలో చెలరేగుతున్నాయి. స్వచ్ బయోలో వేదవల్లి శివానంద రెడ్డి మొదటి డైరెక్టర్.. వీళ్ళు యూపీలో మెస్సే బార్ నడిపిస్తున్నారు. రెండో డైరెక్టర్ ఎనుముల జగదీశ్ రెడ్డి రేవంత్ రెడ్డి సోదరుడు అని ఆరోపించారు.

సీఎంతో ఎంఓయూ కుదుర్చుకున్నపుడు వేదవల్లి గానీ ఎనుముల జగదీశ్ లేరు. హర్ష పసునూరి ఆ ఎంఓయూ సందర్భంగా సీఎం రేవంత్ ఫోటోలో ఉన్నారు.. హర్ష పసునూరి సీఎం సోదరుడి బినామీ. స్వచ్ బయో కంపెనీ ఈ జూలై నెలలో ఏర్పాటైందని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ లేఖ ద్వారా తెలిసింది. స్వచ్ బయో కంపెనీకి వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకునేంత సీన్ లేదు. సీఎం రేవంత్ రాష్ట్ర సంపదను తన సోదరులకు దోచిపెట్టే పనిలో ఉన్నారు అని క్రిశాంక్ దుయ్యబట్టారు

రేవంత్ 30 మంది సభ్యుల ముఠాతో అమెరికా వెళ్ళింది తన సోదరుల వ్యాపారాలు పెంచడం కోసమేనా.. స్వచ్ బయో ఒప్పందం మీద కాంగ్రెస్ నాయకులు స్పందించాలి. వాల్ష్ కర్రా కంపెనీతో రూ. 830 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారు.. అది కూడా ఊరు పేరు లేని కంపెనీ. బోగస్ కంపెనీలకు విలువైన తెలంగాణ భూములు కట్టబెట్టేందుకా రేవంత్ రెడ్డి నీకు అధికారం ఇచ్చింది అని ధ్వజమెత్తారు.

నీ తమ్ముడి కంపెనీతో వ్యాపారం చేయించడానికా రేవంత్ రెడ్డి నీకు సీఎం పదవి వచ్చింది? తమ్ముడి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సీఎం రేవంత్ యూఎస్ దాకా వెళ్ళాలా? కేటీఆర్ యూఎస్ పర్యటన సందర్భంగా ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదిరేవి.. ఇప్పుడు బోగస్ కంపెనీలు వస్తున్నాయి..మా ఆరోపణలపై సీఎం రేవంత్ మౌనంగా ఉండటానికి వీలు లేదు.. స్పందించాలి అన్నారు.

బోగస్ కంపెనీలతో రేవంత్ ఒప్పందాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. రేవంత్ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు బోగస్ కంపెనీలని మేము నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం.మేము చెబుతున్నవన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉన్నవే.. ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అని క్రిశాంక్ స్పష్టం చేశారు.