తెలంగాణలో ఇప్పుడు రేవంత్, ఆయన సోదరుల సామ్రాజ్యం నడుస్తోంది. రేవంత్ సోదరులకు ఏ పదవులు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది.. ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ కుటుంబ పాలన నడుస్తోంది అని దుయ్యబట్టారు.
రేవంత్ తన సోదరులను తెలంగాణ మీదకు వదిలేశాడు. రేవంత్ సోదరులకు ఏ పదవులు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు.
సాక్షాత్తూ అసెంబ్లీ కమిటీ హల్లో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదా లేకున్నా స్పీకర్ దగ్గర వికారాబాద్ రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నారు. కొడంగల్‌లో తిరుపతి రెడ్డి కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంచుతుంటే మా జెడ్పిటీసీ మహిపాల్ అడ్డుకున్నారు. రేవంత్ మరో సోదరుడు కొండల్ రెడ్డికి ఏ హోదా ఉందని అధికారులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు అని ప్రశ్నించారు.
ఆయనకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తోడుగా ఉన్నారు. కొండల్ రెడ్డి కాన్వాయ్‌లో పదుల సంఖ్యలో వాహనాలు ఉంటాయి.. వారికి అధికారులు రాచ మర్యాదలు చేస్తారు. రేవంత్ అమెరికా పర్యటనలో స్వచ్ బయోతో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కంపెనీ రేవంత్ మరో సోదరుడు ఎనుముల జగదీశ్ రెడ్డిది. పదిహేను రోజుల క్రితమే ఆ కంపెనీ ఏర్పాటయ్యింది అని అన్నారు.
ఇవే కాకుండా రేవంత్ సోదరుల ఆధ్వర్యంలో నాలుగు సంస్థలు ఏర్పాటు అయ్యాయి.. ఈ సంస్థల ద్వారానే రేవంత్ బ్లాక్ మనీని వైట్‌గా మారుస్తున్నారు. ప్రధాన కంపెనిలే కాకుండా రేవంత్ సోదరులు అనేక మైక్రో సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. రేవంత్ సోదరులు రియల్టర్లను బెదిరించి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు అని బాల్క సుమన్ విమర్శించారు.
తెలంగాణలో ఇప్పుడు నడుస్తోంది రేవంత్ ఆయన సోదరుల సామ్రాజ్యం.. తెలంగాణ బుద్ధిజీవులు మేధావులు రేవంత్ సోదరుల ఆగడాలపై స్పందించాలి. రేవంత్ అధికార దర్పం, అవినీతిపై తెలంగాణ సమాజం ఆలోచించాలి అని అన్నారు.
డొల్ల కంపెనీలతో పెట్టుబడులు పెట్టిస్తే తెలంగాణ పరువు ఏమవుతుంది? రేవంత్ రెడ్డి రాష్ట్రానికి శాశ్వత సీఎం కాదు.. ఇలాంటి బోగస్ పనులు మానుకోవాలి అని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర పుట్టుకకు అస్తిత్వానికి కారణమైన పార్టీ బీఆర్ఎస్. పద్నాలుగేళ్లు తెలంగాణ రాష్టం కోసం పోరాడాం.. పదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని తెలంగాణ అంటే ఇష్టం లేని వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ ఖచ్చితంగా ఉంటుంది.. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతుంది అని సుమన్ స్పష్టం చేశారు.