mt_logo

అవినీతిలేని పాలన అందిస్తాం- కేసీఆర్

నెలరోజుల తర్వాత టీఆర్ఎస్ పభుత్వం అధికారంలోకి వస్తుందని, కొత్తప్రభుత్వంలో అవినీతికి తావుండదని, అవినీతి అంతం తన పంతం అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ మంగళవారం సాయంత్రం మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన సందర్భంగా కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడేవారు ఎంతటివారైనా ఊరుకోమని, అది నా కొడుకైనా, బిడ్డైనా జైల్లో పెట్టిస్తానని’ అన్నారు. ఇన్నేళ్ళుగా రాజకీయనాయకులు అవినీతితో అక్రమంగా సంపాదించిన జనం సొమ్మును ఎంక్వైరీ పెట్టించి కక్కిస్తా అని, 14 ఏళ్లుగా పోరాటం చేసి తెలంగాణ సాధించింది దోపిడీదారులకోసం కాదని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అవినీతి రాజ్యమేలిందని, ఇళ్ళు కట్టకపోయినా బిల్లులు తీసుకున్నారని, రైతు ఆత్మహత్యలు, చేనేతల ఆకలిచావులు జరిగాయని గుర్తుచేశారు. సింగూరు జలాలు మెదక్, నిజామాబాద్ జిల్లాలకే చెందాలని, అయినా ఆంధ్రా పాలకులు కుట్రలు చేసి నీళ్ళను హైదరాబాద్ తరలించారని, ఇక మీదట అలా జరగదని హామీ ఇచ్చారు. సింగూరు ప్రాజెక్టుకు తాను నిధులు మంజూరు చేయిస్తే జిల్లాలో పెద్దపెద్ద పదవుల్లో ఉన్నవారు కనీసం కాల్వలు కూడా కట్టించలేకపోయారని దామోదర రాజనర్సింహపై మండిపడ్డారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక లక్షరూపాయల వరకు తీసుకున్న పంటరుణాలు, ఇళ్ళ నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని, పక్కా ఇళ్ళు కట్టించి ఇస్తామని, తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని, మొత్తం తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు రావాల్సిందే అని, ఇవేకాక అనేక అంశాలకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలకు కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. మాజీమంత్రి కరణం రాంచందర్ రావు సతీమణి, మెదక్ మాజీ ఎమ్మెల్యే కరణం ఉమాదేవి, నిజామాబాద్ కు చెందిన సామాజిక కార్యకర్త బీబీ పాటిల్, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్ రెడ్డి, జహీరాబాద్ వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి మాణిక్యరావు, టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జైపాల్ నాయక్ తదితరులు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *