mt_logo

ఏపీఐఐసీ లో తెలంగాణ ఉద్యోగులపై ఆంధ్రా దౌర్జన్యం

మరో రెండు నెలల్లో రాష్ట్రం రెండుగా విడిపోతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యోగులపై సీమాంధ్ర అధికారుల వేధింపులు అధికమయ్యాయి. ఇటీవలే కార్మికశాఖలో తెలంగాణ ఉద్యోగులపై దొంగతనం నెపం వేయగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) లో కూడా అదే పరిస్థితి నెలకొంది. తెలంగాణ ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటం, అడిగేవారు లేరన్న పొగరుతో దారుణమైన చర్యలకు పాల్పడుతున్నారు. మౌలాలిలోని సంస్థ కార్యాలయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన డిప్యూటీ జోనల్ మేనేజర్ కు చెందిన బీరువాను పగలగొట్టి ఆంధ్రాకు చెందిన డిప్యూటీ జోనల్ మేనేజర్ ఫైళ్ళను పరిశీలించారు. ఈ విషయంపై సదరు వ్యక్తి తన అల్మారాను పగులగొట్టిన ఆంధ్రా అధికారిపై ఏపీఐఐసీ ఎండీ జయేష్ రంజన్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే స్పందించిన ఆయన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ను ఆదేశించారు. అనుమతిలేకుండానే బీరువాను పగలగొట్టి ఫైళ్ళను పరిశీలించినట్లు ప్రాధమిక విచారణలోనే తేలినా నేరం చేసిన వ్యక్తిపై కేసు పెట్టడం జరగలేదు. కారణం అతడు ఆంధ్రాప్రాంతానికి చెందిన వ్యక్తి కావడమే అని, ఉన్నతాధికారులు అతడికి అండగా నిలిచారని పలువురు తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే కనీసం అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా తిప్పిపంపుతున్నారని, ఒకవైపు రాష్ట్ర విభజన జరుగుతుండగానే మరోవైపు తెలంగాణ జిల్లాలలో పనులను పర్యవేక్షించడానికి ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఆర్.చెంచయ్యకు బాధ్యతలు అప్పగించారని, తమకు సరైన బాధ్యతలు అప్పగించకుండా సీమాంధ్ర అధికారులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఏపీఐఐసీకి చెందిన తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *