mt_logo

సీమాంధ్రుల కనుసన్నల్లో టీ టీడీపీ మేనిఫెస్టో- హరీష్ రావు

చంద్రబాబు ప్రకటించిన తెలంగాణ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో సీమాంధ్రుల కనుసన్నల్లోనే తయారుచేసినట్లు ఉందని, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతుకోసేలా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో మాట్లాడుతూ హరీష్ రావు తెలంగాణ టీడీపీ మేనిఫెస్టో పై విమర్శలు చేశారు. తెలంగాణ టీడీపీ ఎప్పటికీ ఆంధ్రదేశం పార్టీలాగే కొనసాగుతుందని, మేనిఫెస్టో చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు. ఓట్లకోసం చంద్రబాబు దిగజారినట్లు స్పష్టంగా తెలుస్తుందని, అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ళు చేయని పనులన్నిటినీ త్వరలో జరగబోయే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో అమరుల గురించి చెప్పిన చంద్రబాబుకు టీడీపీ వల్లే తెలంగాణ కోసం 1200మంది బలయ్యారనే విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. అదే విషయాన్ని సూసైడ్ నోట్ లో కూడా స్పష్టంగా రాశారని, కావాలంటే ఆ సూసైడ్ నోట్ లను చంద్రబాబుకు పంపిస్తానని అన్నారు. వ్యవసాయం దండగ అన్న బాబు ఇప్పుడు అదే వ్యవసాయానికి 9గంటల విద్యుత్ సరఫరా చేస్తానని రైతులను మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా 10వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై సీమాంధ్రుల బొమ్మలే ఉన్నాయని, ఒక్క తెలంగాణ టీడీపీ నేతవి కూడా లేవని చెప్పారు. త్వరలో తెలంగాణలో టీడీపీ ఆఫీసులకు టులెట్ బోర్డులు పెట్టడం తప్పదని, తెలంగాణలో ఉండే పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడానికి కాళ్ళబేరానికి వెళ్ళారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *