mt_logo

ప్రతి ఛాలెంజ్ ను అవకాశంగా మలుచుకున్నాం : మండలి ప్రసంగంలో కేటీఆర్

ప్రతి చాలెంజ్‌ను ఒక అవకాశంగా మలుచుకుంటూ విజయాలు సాధిస్తూ వస్తున్నామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశం గర్వించదగ్గ పథకాలను అమలు చేస్తున్నామని, అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే విధానాలను అవలంబిస్తున్నామని చెప్పారు. వ్యవసాయం- పరిశ్రమలు, పల్లెలు- పట్టణాలు, ఆహార శుద్ధి- ఐటీ రంగాల్లో సమ్మిళిత వృద్ధి నమోదు అవుతున్నదని పేర్కొన్నారు. శుక్రవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానాలిచ్చారు. ఐటీ, పరిశ్రమల పురోగతిపై స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ సమయంలో దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఊరూరా ధాన్యం కొనుగోళ్లు చేశామని చెప్పారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా జ్యూట్ మిల్లులు మూతపడటంతో గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఏర్పడగా.. వచ్చే ఏడాది కల్లా రాష్ట్రంలో జూట్‌మిల్లులు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. ఈ మేరకు రూ.887 కోట్లతో కామారెడ్డి, వరంగల్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మూడు జూట్‌ మిల్లుల పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయని తెలిపారు. ఈ మిల్లులు తయారుచేసే గన్నీ బ్యాగులను పౌరసరఫరాలశాఖే కొంటుందన్నారు. ఇలా ‘విన్‌ విన్‌’ పద్ధతుల్లో ముందుకు పోతున్నామని పేర్కొన్నారు.

రెట్టింపైన రైతు ఆదాయం:

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వ్యవసాయరంగం దేశమే ఆశ్చర్యపోయేలా అభివృద్ధి సాధించిందని కేటీఆర్‌ తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో పంజాబ్‌ను దాటిపోయామని ఎఫ్‌సీఐ చెప్పిందని.. ఇది ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడే విషయమన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో రైతు ఆదాయం 6.95% పెరిగిందని చెప్పారు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న సిరిసిల్లలో నేడు లక్ష టన్నుల వ్యవసాయ దిగుబడులు పెరిగాయని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో హరిత, శ్వేత, నీలి, గులాబీ విప్లవాలు వచ్చాయని తెలిపారు. గతంలో వలసల జిల్లాగా ఉన్న పాలమూరుకు నేడు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వలస వస్తున్న పరిస్థితి ఏర్పడడం సంతోషకరమని.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలవల్లే ఈ ప్రగతి సాధ్యమైందని కేటీఆర్‌ అన్నారు.

సీఆర్‌ఎంపీ కింద రోడ్ల అభివృద్ధి:

గ్లోబల్‌ వార్మింగ్‌, క్లైమేట్‌ చేంజ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్‌సీజనల్‌ వర్షాలు కురుస్తున్నాయని, దీంతో రోడ్లు దెబ్బతింటున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఎస్సార్డీపీ కింద లింక్‌రోడ్లు, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఓఆర్‌ఆర్‌పై ట్రాఫిక్‌ పెరిగిందని.. 10 ఇంటర్‌ చేంజ్‌ల వద్ద ట్రామాకేర్‌ పాయింట్లను నెలకొల్పామని తెలిపారు. ఈ ఇంటర్‌ చేంజ్‌ల వద్ద ఫ్యూయల్‌ స్టేషన్స్‌, ఫుడ్‌కోర్టుల ఏర్పాటుకు యోచిస్తున్నామన్నారు. ఫుడ్‌కోర్టుల్లో రిజర్వేషన్ల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. హైదరాబాద్‌లోని మణికొండలో డ్రైనేజీలో పడి చనిపోయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రజనీకాంత్‌ కుటుంబానికి 10 లక్షలు అందిస్తామని, అధికారుల నిర్లక్ష్యానికి తాను బాధ్యత తీసుకుంటానని తెలిపారు.

దేశాలతోనే తెలంగాణకు పోటీ :

పరిశ్రమలను ఆకర్షించడంలో తెలంగాణ దేశాలతో పోటీపడే స్థాయికి ఎదిగిందని, ఇటీవల రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలే దీనికి నిదర్శనమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తాతలనాటి కులవృత్తులు, బోర్లాపడ్డ పరిశ్రమలు బాగుపడాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అని చెప్పారు. పెట్టుబడులు, ఉపాధికి పెద్దపీట వేసే ఐటీ, పరిశ్రమల రంగంపై రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. నేడు ప్రపంచం డిజిటల్‌ విప్లవం అనే నాలుగవ పారిశ్రామిక విప్లవం ముంగిట ఉన్నదని.. అవకాశాలను అందిపుచ్చుకుంటే మనకు తిరుగుండదని వివరించారు. పురోగమిస్తున్న తెలంగాణకు కేంద్రప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. విభజన హామీలతోపాటు, నూతన ప్రతిపాదనలకు సహాయం అందించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో అసాధారణమైన ప్రగతి నమోదైందని సాక్షాత్తూ కేంద్రమంత్రులు, కేంద్రప్రభుత్వ నివేదికలు, గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని కేటీఆర్‌ చెప్పారు. ఈఓడీబీ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం టాప్‌ స్థానాల్లో ఉన్నదని తెలిపారు. కొత్త ఐటీ పాలసీలో రాబోయే ఐదేండ్లలో 50 వేల ఉద్యోగాలు టైర్‌-2 సిటీస్‌లో కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *