mt_logo

వరంగల్ నగరానికి యునెస్కో గుర్తింపు… హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు మరో ప్రపంచ గుర్తింపు వచ్చింది. గత ఏడాది ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తింపు పొందగా.. తాజాగా సోమవారం వరంగల్‌ నగరాన్ని గ్లోబల్‌ నెటవర్క్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ సిటీ(జీఎన్‌ఎల్‌సీ)గా గుర్తింపునిచ్చినట్లు యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఆడ్రే అజౌలే ప్రకటించారు. 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీస్‌) ఆధారంగా 44 దేశాల్లోని 77 నగరాలను జీఎన్‌ఎల్‌సీగా గుర్తించినట్లు ఆమె వెల్లడించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీఎన్‌ఎల్‌సీల సంఖ్య 294కు చేరుకున్నట్లు వివరించారు.

ఈ నేపథ్యంలో నగరాల్లో సమానత్వం, సామాజిక వెలిని రూపుమాపుతూ.. అన్నివర్గాలను కలుపుకొనిపోయేలా చేయడం, భద్రత, సుస్థిర అభివృద్ధి, అక్షరాస్యత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పెరుగుదల, ఆరోగ్యం-సంపదల విషయంలో సుస్థిరత్వం, ప్రపంచ పౌరసత్వ విద్య, సమగ్ర విద్యకు ప్రణాళికలు, వీటిని అమలు చేసేలా స్థానిక సంస్థల నిరంతర పర్యవేక్షణ-మూల్యాంకనం వంటి అంశాలపై దృష్టి సారించేలా 2012లో యునెస్కో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌(యూఐఎల్‌) సంస్థను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ సంస్థ రెండేళ్లకోసారి జీఎన్‌ఎల్‌సీలను ప్రకటిస్తోంది. ఒక నగరం జీఎన్‌ఎల్‌సీ అర్హత పొందాలంటే..ఎస్‌డీజీస్‌ లో 17 అర్హతలను సాధించాలి. వరంగల్‌ నగరానికి జీఎన్‌ఎల్‌సీ గుర్తింపు రావడం పట్ల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా వరంగల్‌ ప్రజలకు అభినందనలు తెలిపారు. కాగా.. తాజాగా జీఎన్‌ఎల్‌సీగా గుర్తింపు పొందిన 77 నగరాల్లో కేరళ రాష్ట్రంలోని త్రిషుర్‌, నీలంబర్‌ ఉన్నాయి. వీటితోపాటు.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, దక్షిణాఫ్రికాలోని డర్బన్‌, యూఏఈలోని షార్జా నగరాలకు ఈ గుర్తింపు లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *