ఈనెల 30న జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ నే గెలిపించాలని, ఇవి ఆషామాషీ ఎన్నికలు కావని, తెలంగాణ తలరాతను మార్చే ఎన్నికలని సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల తారకరామారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రుల పాలనలో అన్నివిధాలా నష్టపోయిన తెలంగాణ సాధించుకోవడానికి 14 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేశామన్నారు. అమరుల బలిదానం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, వచ్చిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని పేర్కొన్నారు.
శుక్రవారం ముస్తాబాద్ మండలంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ తెలంగాణ పునర్నిర్మాణం చేస్తుందని, అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని అంశాలనూ అమలు చేస్తామని, తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇన్నాళ్ళూ అవినీతిపాలన అందించిన సీమాంధ్ర నేతలను తరిమివేసినా ఇంకా ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నారని, ప్రజలు ఆంధ్రా నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీకి ఓటేస్తే సీమాంధ్ర పాలకులకు ఓటువేసినట్లేనని, మళ్ళీ అలాంటి పొరపాటు చేయొద్దని కేటీఆర్ ప్రజలకు సూచించారు.