mt_logo

మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ సభ

మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో జరిగిన ఎన్నికల బహిరంగసభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. ఎన్నో పోరాటాలు, లాఠీలు, తూటాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని, తెలంగాణను ఎవరిచేతిలో పెడితే సేఫ్ గా ఉంటుందో వారికే అధికారాన్ని కట్టబెట్టాలని, మన తలరాతను మనమే రాసుకోవాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు లక్ష వరకు రుణమాఫీ చేస్తామని, వృద్ధులకు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ. 1500 పెన్షన్ ఇస్తామని, 125 గజాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని, ట్రాక్టర్లు, ఆటోలు, ట్రాలీలకు రవాణా పన్ను ఉండదని, మహిళా సంఘాలకు 5 నుంచి 10లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. లంబాడీ గిరిజనులకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, తండాలను పంచాయితీలుగా గుర్తిస్తామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

కల్వకుర్తి కరువుప్రాంతమని, ఇక్కడ ఎంతోమంది మహానుభావులు పనిచేసినా అభివృద్ధి మాత్రం జరగలేదన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టు ఎన్నాళ్ళుగానో పెండింగ్ లో ఉందని, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు, బీమా ఎత్తిపోతల పథకాలను పూర్తిచేసి సాగునీరందించే బాధ్యత తనదేనన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా జితేందర్ రెడ్డిని, కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా జైపాల్ యాదవ్ ను గెలిపించాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నాగర్ కర్నూల్ మండలం ఉయ్యాలవాడలో జరిగిన బహిరంగసభకు భారీ సంఖ్యలో జనం విచ్చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ, నాగర్ కర్నూల్ వెనుకబడ్డ ప్రాంతమని, అధికారంలోకి రాగానే నాగర్ కర్నూల్ కు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. ‘మహబూబ్ నగర్ ఎంపీగా తెలంగాణ సాధించాను. పాలమూరు జిల్లా భయంకరమైన వలసల జిల్లాగా కరువుతో చితికిపోయింది. ఈ జిల్లా బాధలు నాకు తెలుసు. పాలమూరు కరువు తీరాలంటే నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాలు పూర్తిచేయాలి. అవసరమైతే ఇక్కడే కూర్చుని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.’ అని గులాబీనేత హామీ ఇచ్చారు. కరువుతీరాలంటే టీఆర్ఎస్ నే గెలిపించాలని, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24గంటలు కరెంట్ అందించే బాధ్యత తనదేనని, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మనం మోసపోతామని, కాంగ్రెస్ నేతల చేతిలో తెలంగాణను పెడితే నష్టపోతామని కేసీఆర్ ప్రజలకు సూచించారు.

తన ఆస్తులపై విచారణ జరిపించాలని సీబీఐ కోర్టు జారీ చేసిన ఆదేశాలను స్వాగతిస్తున్నానని, తనపై కేసులుంటే ఎప్పుడో బొందపెట్టే వాళ్ళని అన్నారు. సీబీఐ కాదు, డీబీఐ వచ్చినా స్వాగతిస్తానని, తాను నిప్పులా పెరిగిన మనిషినని, తన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని వివరించారు. టీఆర్ఎస్ ప్రభంజనం చూడలేకే కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. పొన్నాల పెద్ద గజదొంగ అని, పీసీసీ పదవికి పొన్నాల రాజీనామాచేసేలా రాహుల్ గాంధీ చర్యలు తీసుకోవాలని, దళితుల వద్ద తీసుకున్న భూములను పొన్నాల ప్రభుత్వానికి అప్పగించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ ఎంపీగా మందా జగన్నాథం, ఎమ్మెల్యేగా మర్రి జనార్ధన్ రెడ్డిలను గెలిపించాలని కేసీఆర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *