కొంపెల్లి వెంకట్‌గౌడ్ రచించిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ‘వొడువని ముచ్చట’ పుస్తకం ఆరో ముద్రణను బుధవారం నమస్తే తెలంగాణ కార్యాలయంలో పత్రిక చైర్మన్, సీఎండీ సీఎల్ రాజం ఆవిష్కరించారు. ఇందులో ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ అల్లం నారాయణ, సీఈవో కట్టా శేఖర్‌రెడ్డి, అసిస్టెంట్ ఎడిటర్లు కే కృష్ణమూర్తి, వేణుగోపాలస్వామి, నెట్‌వర్క్ ఇన్‌చార్జీ మార్కండేయ, బ్లాక్‌వాయిస్ ప్రతినిధులు శ్రీకాంత్ కాంటేకర్, శ్రవణ్ అడప, ప్రశాంత్ పాల్గొన్నారు.
తెలంగాణ అణచివేతకు, దోపిడీకి, పీడనకు వ్యతిరేకంగా రాష్ట్ర సాధన కోసం అసువులు బాస్తున్న యువతలో మనోస్థైర్యాన్ని నింపడమే తెలంగాణ బ్లాక్‌వాయిస్ లక్ష్యమని ఆ సంస్థ ప్రతినిధి హరికాంత్ తెలిపారు. తెలంగాణ వనరులను కాపాడడానికి వీరోచితమైన పోరాటం సాగుతోందని, ఈ క్రమంలోనే యువత చేసుకుంటున్న ఆత్మహత్యలు నివారించడానికి బ్లాక్‌వాయిస్ కృషిచేస్తోందని తెలిపారు. భూముల రక్షణలో భూమి పుత్రుల పోరాటాలకు మద్దతుగా ఉంటుందని చెప్పారు. సంస్కృతీ, భాష, చరిత్రని కాపాడే వాళ్ళకు, కల్మషం లేని ఉద్యమకారులు, కవులు, రచయితలకు, నిరంతరం ప్రజల పక్షాన నిలబడే సంస్థలకు అండగా నిలబడటమే బ్లాక్‌వాయిస్ లక్ష్యమని అన్నారు. ‘వొడువని ముచ్చట’ ఆరవ ముద్రణ కాపీలను బ్లాక్‌వాయిస్ ఉచితంగా పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ పుస్తకం ప్రతులను ‘నమస్తే తెలంగాణ’ కార్యాలయంలో ఉచితంగా పంపిణీ చేశారు.