విస్తారా ఎయిర్ లైన్స్ సీఈవో ఫీ తెక్ వో బుధవారం సచివాలయంలో ఐటీ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, విస్తారా ఎయిర్ లైన్స్ కార్యకలాపాలను విస్తరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని, ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ పోర్ట్ సేవల రంగంలో హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టు 20 శాతం ప్రయాణికుల వృద్ధి సాధిస్తుందని, నగరంలో టాటా గ్రూప్ నకు చెందిన పలు కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. టాటాలు తమ బ్రాండ్ అంబాసిడర్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇప్పటికే చెప్పారని, విస్తారా ఎయిర్ లైన్స్ హైదరాబాద్ కేంద్రంగా మరిన్ని కార్యకలాపాలు ప్రారంభించాలని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీని కలిసి ప్రత్యేకంగా కోరుతామని మంత్రి తెలిపారు.
అనంతరం విస్తారా సీఈవో మాట్లాడుతూ, హైదరాబాద్ విమానాశ్రయంలో ఉన్న మౌలిక వసతులను చూశామని, నూతనంగా సేవలు ప్రారంభించే ఏ కంపెనీకైనా హైదరాబాద్ లో అవకాశాలు కలిసి వస్తాయని అన్నారు. తమ విస్తరణ ప్రణాళికలో హైదరాబాద్ ను దృష్టిలో ఉంచుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ విస్తారా సీఈవో, ఎయిర్ లైన్స్ ప్రతినిధి గురుజ్యోత్ సింగ్ మాలీలను శాలువాతో కప్పి మెమెంటో అందజేశారు. ఈ సమావేశంలో ఎంపీ సీతారాం నాయక్, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.