mt_logo

త్వరలో తెలంగాణలో టీడీపీ కనుమరుగు- ఈటెల రాజేందర్

ఈనెల 24న టీఆర్ఎస్ నిర్వహించనున్న ప్లీనరీ అనంతరం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగు అవుతుందని, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఈ ప్లీనరీ మరో చరిత్రకు మలుపు కాబోతోందని, ప్లీనరీలో అన్ని అంశాలపై చర్చిస్తామని, ప్రభుత్వానికి పార్టీ, కార్యకర్తలు రెండు కళ్ళలాంటివని ఆయన తెలిపారు. రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతుకు గిట్టుబాటు ధర రాకుంటే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.

పౌరసరఫరాల శాఖలో అందరికీ సంబంధం ఉందని, మానవతా దృక్పథంతో మనిషికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామని ఈటెల చెప్పారు. బియ్యం కోసం ప్రభుత్వం రూ. 2600 కోట్లు ఖర్చు చేస్తున్నదని, చక్కెరకు సంబంధించి మూడు నెలలకోసారి టెండర్లు పిలుస్తున్నామని, నిజాం షుగర్ ఫ్యాక్టరీలోని చక్కెరనంతా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, సొంత పార్టీ ఎమ్మెల్యేలను కొన్న చరిత్ర చంద్రబాబు నాయుడిదని, టీడీపీ నేతలకు టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తేల్చిచెప్పారు. ప్లీనరీని అద్భుతంగా నిర్వహిస్తామని, పార్టీ ఖాళీ అవుతుందనే అక్కసుతోనే టీడీపీ నేతలు ఊగిపోతూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *