mt_logo

మెదక్ జిల్లా జహీరాబాద్ లో మహీంద్రా కొత్తప్లాంటు ప్రారంభం..

మెదక్ జిల్లా జహీరాబాద్ లో మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో రూ. 250 కోట్లతో నూతనంగా ఏర్పాటుచేసిన ఆటోమోటివ్ ప్లాంట్ ను బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేవారికి అన్ని రకాల వసతులు కల్పిస్తామని, ఆయా పరిశ్రమలలో తమ తెలంగాణ బిడ్డలకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లోనే అన్ని అనుమతులు ఇస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు.

తెలంగాణ దగాబడ్డ ప్రాంతమని, నెత్తురు ధారపోసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. దగాబడ్డ తెలంగాణ నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించమని, ఈ విషయంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ముందుండాలని ఆ సంస్థ ప్రతినిధులకు సీఎం కేసీఆర్ సూచించారు. ప్రపంచ స్థాయిలో పేరుపొందిన పారిశ్రామిక సంస్థలు తెలంగాణలో పోటీ పడుతున్నాయని, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శామ్ సంగ్ హైదరాబాద్ లో 100 మిలియన్ అమెరికన్ డాలర్లతో యూనిట్ నెలకొల్పడానికి ముందుకొచ్చిందని సీఎం తెలిపారు. అంతేకాకుండా ఇటీవల మెదక్ జిల్లా ఎంఆర్ఎఫ్ ప్రతినిధులు తనను కలిసి రూ. 980కోట్లతో పరిశ్రమను విస్తరించి వెయ్యిమందికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని కేసీఆర్ గుర్తుచేశారు.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జహీరాబాద్ ప్రాంతంలో పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ, స్కిల్ డెవెలప్ మెంట్ సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి జహీరాబాద్ సమీపంలో 220 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. గతంలో పరిశ్రమలకు కరెంట్ కోతలుండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, పరిశ్రమలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని, స్వయంగా పారిశ్రామికవేత్తలే ఫోన్లు చేసి ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మహీంద్రా కంపెనీ తయారు చేసిన 4 చక్రాల ఆటోను సీఎం కేసీఆర్ నడిపి ప్రారంభించారు. అనంతరం సంస్థ ప్రతినిధులతో కలిసి ప్లాంటును సందర్శించారు. ఈ కార్యక్రమంలో భారీ పరిశ్రమల శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి హరీష్ రావు, ఎంపీ బీబీ పాటిల్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *