జాగరణ దీక్షకు పూనుకొని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కరోనా నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌ను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించడమే కాకుండా అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు మీరి ప్రజారోగ్యానికి భంగం కలిగించేలా బండి సంజయ్ మొండిగా వ్యవహరించడం మూలంగానే, నిబంధనలకు అనుగుణంగా అరెస్ట్ చేశామని పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల బదిలీల్లో 317జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లో బండి సంజయ్ జాగరణదీక్ష తలపెట్టారు. సంజయ్ అరెస్ట్‌కు ముందు దీక్షా స్థలిలో బీజేపీ కార్యకర్తలు పోలీసులపైకి కుర్చీలు విసిరి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో, పోలీసులు కార్యాలయం గేట్లను బలవంతంగా తెరిచారు.
ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాపిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10వరకు సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. మరోవైపు కేంద్రం కూడా సమూహాలను నిషేధించాలని రాష్ట్రాలను స్పష్టంగా ఆదేశించింది. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు కూడా సమూహాలను నియంత్రించడం ద్వారానే కరోనాను చెక్ పెట్టాలని మార్గదర్శకాలను విడుదల చేసి, రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. అయినా వాటన్నింటిని ధిక్కరించి జాగరణకు పూనుకోవడంతో బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కొవిడ్ విస్తరిస్తున్న దృష్టా దీక్షలకు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వడంలేదని ఆయన పేర్కొన్నారు.