mt_logo

తల్లిదండ్రులంతా విధిగా పిల్లలకు వాక్సిన్ వేయించండి : మంత్రి హరీష్ రావు

రాష్ట్రంలో 15-18 ఏళ్ల పిల్లలకు తల్లిదండ్రులంతా కరోనా వ్యాక్సిన్ వేయించాలని కోరారు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్ బంజారాహిల్స్​ పీహెచ్​సీలో 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు… ‘‘తల్లిదండ్రులంతా పిల్లలకు విధిగా వ్యాక్సిన్ వేయించాలని, ఆ బాధ్యత తల్లిదండ్రులదే అని స్పష్టం చేశారు. పిల్లలకు టీకా వేయించేందుకు కళాశాలల యాజమాన్యాలూ బాధ్యత తీసుకొని, వారి కళాశాలల్లో చదివే పిల్లలందరికీ టీకాలు వేయించాలని సూచించారు. ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ పిల్లలకు టీకా ఇచ్చేందుకు అనుమతి ఉందన్నారు. నగరంలో 12 కార్పొరేషన్‌లలో ఆన్‌లైన్, ఇతర ప్రాంతాల్లో వాక్ ఇన్ పద్ధతిలో టీకాలు ఇస్తున్నామని, దీనితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 1,014 కేంద్రాల్లో పిల్లలకు టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నాలుగు రోజుల తరువాత పరిస్థితినిబట్టి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌పై మరోసారి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలియజేసారు. రిజిస్ట్రేషన్‌కు బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, కాలేజీ ఐడీ కార్డ్ ఉంటే సరిపోతుందన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు, సదుపాయాలు ఉన్నాయని, 21 లక్షల హోమ్ ఐసోలేషన్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని, కొవిడ్‌ టీకాలపై ఎలాంటి అపోహలు అవసరం లేదని, వ్యాక్సిన్‌ తీసుకుంటే రక్షణ కవచంలా పని చేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున, అందరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనా లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్యారోగ్యశాఖ కూడా పూర్తిసాయిలో సన్నద్ధంగా ఉండాలని అధికారులకు మంత్రి హరీష్ రావు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *