హైదరాబాద్ లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ లో పాలిస్టో కేంద్రాన్ని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది విద్యుత్ ఉత్పత్తి కోసమేనని, ప్రాజెక్టులో 834 అడుగుల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని జీవోలో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. 1996 లో జీవో నంబరు 69 విడుదల చేసింది చంద్రబాబు కాదా? అని, మేము చెప్పిన అంశాలన్నీ జీవోలో ఉన్నాయని, అవసరమైతే జీవో కాపీని ఏపీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమకు పంపిస్తామని కేటీఆర్ చెప్పారు.
మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం సృష్టిస్తున్న ఇబ్బందులను సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజనకు ముందే విడుదలైన జీవో 69, 107ల ప్రకారం ఎక్కడా ఉల్లంఘనలు జరగలేదని తెలంగాణ ఇంజినీర్లు చెప్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో చేతికొచ్చిన పంటలను ఎండిపోకుండా రక్షించుకోవడం కోసమే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపేశారని వస్తున్న వార్తలు నిరాధారమని, విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూనే ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.