mt_logo

ఉద్యమస్ఫూర్తితో “మన ఊరు, మన చెరువు”

By: శ్రీధర్ దేశ్ పాండే

ఈరోజు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు చిన్న నీటి వనరుల పునరుద్దరణ పై సమగ్ర సమీక్ష జరిపినారు. ఈ సమీక్షలో చిన్న నీటి పారుదల చీఫ్ ఇంజనీర్ గారు ఈ కార్యక్రమంపై ముఖ్యమంత్రి గారికి ప్రెజెంటేశన్ ఇచ్చారు.

ఈ “చిన్న నీటిచెరువుల పునరుద్దరణ” కార్యక్రమాన్ని “మన వూరు – మన చెరువు “ గా ముఖ్యమంత్రి నామకరణం చేసినారు. ఈ పునరుద్దరణ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడు సుమారుగా 9000 చెరువులను 4500 కోట్ల అంచనాలతో అభివృద్ది చేయాలని నిర్ణయించినారు.

పునరుద్దరణ కార్యక్రమంలో చేపట్టబోయే పనులు:

• పూడికలు తీసి చెరువుల , కుంటల నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచడం
• చెరువు కట్టను బలోపేతం చెయ్యడం
• చెరువు అలుగు, తూములను మరమ్మతు చెయ్యడం
• క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్ లను మరమ్మతు చెయ్యడం
• చెరువుల్లో పెరిగిన తుమ్మ చెట్లను నరికి వెయ్యడం, గుర్రపు డెక్క, లొట్టపీసు మొక్కల తొలగింపు
• గొలుసుకట్టు చెరువులను బాగు చేసుకోవడం
• తొలగించిన పూడికను రైతుల పంట భూముల్లో పరచడం
• కట్ట బలోపేతానికి సరిపడే పూడిక మట్టిని వాడుకోవడం
• అవసరమైన చోట్ల ఫీడర్ చానళ్ళను రీ సెక్షన్ చేయడం, పూడిక తీయడం

ముఖ్యమంత్రిగారు ఈ కార్యక్రమాన్ని యుద్ద ప్రాదిపదికన డిసెంబరు నెల మొదటి వారం నుంచి ప్రారంభించాలని ఆదేషించినారు. ప్రింసిపల్ సెక్రెటరి , మైనర్ చీఫ్ ఇంజనీరు గారు ఈ కార్యక్రమం సత్వరంగా జరగటానికి టెండర్ల ప్రక్రియలో కొన్ని మార్పులను ప్రతిపాదించినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వాటికి ఆమోదం తెలిపినారు.

ఇ ఇ లకు 50 లక్షల వరకు, ఎస్ ఇ లకు 100 లక్షల వరకు , చీఫ్ ఇంజనీర్ కు 400 లక్షల వరకు సాంకేతిక అనుమతులు , టండర్లు పిలవడానికి ప్రతిపాదనలని ముఖ్యమంత్రి గారు సూత్రప్రాయంగా అంగీకరించినారు.
ఈ చెరువుల పునరుద్దరణలో చెరువుల ఎంపిక జిల్లా మంత్రిగారి , నియోజక వర్గ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అవసరాన్ని బట్టి ఎంపిక చేయటం జరుగుతుంది.

ఏ గ్రామంలోనయితే రైతులు స్వచ్చందంగా పూడిక మట్టిని వారి పొలాలకు తరలించుకోవడానికి ముందుకు వస్తారో ఆ గ్రామాల చెరువులను పునరుద్దరణలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ముఖ్యమంత్రిగారి సూచనల మేరకు ప్రతీ నియోజక వర్గ కేంద్రంలో ఒక పట్టణ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా పునరుద్దరించడానికి ప్రతిపాదనలు సిద్దం చేయటం జరుగుతుంది.

ప్రతీ చెరువుకు ఒక టెండర్ ను ప్రత్యేకంగా పిలచి పునరుద్దరణ జరపాలని నిర్ణయించినారు. ఈ పునరుద్దరణ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో జరపాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. అందుకు ప్రజలని సమాయత్తం చేయడానికి నవంబరు నెలలో పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాల ద్వారా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినారు. టివీ మీడియా , పత్రికలు , ఆడియో , వీడియో క్లిప్పింగులు , హోర్డింగులు , కరపత్రాలు , పోస్టర్లు, గోడరాతలు, కళారూపాలు తదితర మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి ప్రజలని చైతన్యవంతం చేసి పునరుద్దరణలో భాగస్వాములని చేయాలి.

గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం మీద జిల్లా ప్రాదిపదికన స్కూలు , కాలేజి విధ్యార్తులకు వ్యాసరచన , వక్తృత్వ , చిత్ర రచన పోటీలు నిర్వహించి విద్యార్తులకు బహుమతులు ఇవ్వాలని ప్రతిపాదించి వారిని ఈ విధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించటం జరిగింది.

ఎవరైనా తెలంగాణ ప్రవాస భారతీయులు తమ గ్రామ చెరువును దత్తత తీసుకొని నిధులను సమకూర్చి పునరుద్దరణలో పాలు పంచుకోవడనికి ఆహ్వానం పలకాలని నిర్ణయించడం జరిగింది.

ఈ సమీక్షలో సాగునీటి శాఖ మంత్రి శ్రీ టి హరీష్ రావు గారితో పాటు సాగునీటి ముఖ్య కార్యదర్శి శ్రీ ఎస్ కె జోషి, ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీ మురళీధర్ , మైనర్ చీఫ్ ఇంజనీర్ శ్రీ ఎ రామ కృష్ణారావు, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ మల్సూర్ , ఒ ఎస్ డి శ్రీ శ్రీధర్ దేశ్ పాండే , పి ఎస్ శ్రీ అశోక్ రెడ్డి, డి సి ఇ శ్రీ రమేశ్ మరియు శ్రీ వేణు గార్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *