mt_logo

చంద్రబాబు దగా ఖరీదు రూ. 608 కోట్లు!

శుక్రవారం సచివాలయంలో రెండుగంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు బాబు సైతాన్ లా వ్యవహరిస్తున్నాడని, ఇక్కడ పంటలు ఎండబెట్టాలని చూస్తున్నాడని, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరి బతుకు వారు బతకాల్సిందిపోయి పక్కరాష్ట్రంలో నిప్పులు పోస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన మోసానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 608 కోట్లు అదనపు విద్యుత్ కోసం ఖర్చు చేయాల్సి వచ్చిందని, ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడుతున్నామని అన్నారు.

ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణకు వచ్చే విద్యుత్ ను వదిలిపెట్టేది లేదని, ముక్కు పిండి వసూలు చేస్తామని, చంద్రబాబు చేసిన నష్టం మీద సుప్రీంకోర్టుకు వెళ్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. శ్రీశైలం జల విద్యుత్ ను ఆపేదిలేదని, పంటలను కాపాడుకోవడం తమ లక్ష్యమని, కేటాయించిన జలాల ప్రకారం 81 టీఎంసీల నీరును వినియోగించుకునే హక్కు తెలంగాణకు ఉందన్నారు. విద్యుత్ విషయంలో ఈఆర్సీ ఛీ కొట్టినా బాబుకు బుద్ధి రాలేదని, చంద్రబాబు దొంగచూపుల వల్ల రాష్ట్రం కరెంట్ కోతలకు గురవుతుందని, ఆయన చేసిన మోసం వల్లనే 82 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను 4 నెలల్లోనే నష్టపోయామని సీఎం చెప్పారు.

చంద్రబాబు తొమ్మిదేళ్ళు సీఎంగా ఉండి కూడా తెలంగాణలో ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కూడా నిర్మించలేదని, మొత్తం ఏపీలోనే పెట్టారన్నారు. ‘శ్రీశైలం ఏమన్నా నీ అయ్య జాగీరా? దానిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉందన్నారు. మాట్లాడితే చర్చలంటున్నావు.. ఆబిడ్స్ లో నెహ్రూ బొమ్మ వద్ద చర్చించుకుందామా? లేకపోతే ప్రకాశం బ్యారేజి మీద అయినా సరే, నువ్వు అక్కడి రైతులు, డ్వాక్రా మహిళలకు ఏమి హామీలిచ్చావో, ఎట్లా దగా చేశావో, సీడీలు పట్టుకొని వస్తా’ అని కేసీఆర్ బాబుకు సవాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *