mt_logo

విడిపోతే నష్టం ఎవరికి?

By: విశ్వరూప్

పదేళ్ళ నుండీ మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడూ, రాష్ట్రంలో అన్ని పార్టీలు తెలంగాణను మానిఫెస్టోల్లో పెట్టి రాజకీయం చేస్తున్నప్పుడూ ఏనాడూ పట్టించుకోని సీమాంధ్ర నాయకులు డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన తరువాత ఏదో కొంపలు మునిగిపోయినట్లు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని లేవదీశారు. ఈ ఉద్యమం నాయకులు తయారుచేసిన కృత్రిమ ఉద్యమం అయినప్పటికీ ఈ ఉద్యమం ద్వారా మీడియా సహాయంతో వీరు “తెలంగాణ వస్తే ఆంధ్రా ప్రజలకు నష్టం వాటిల్లుతుంది, హైదరాబాదునుండి తరిమేస్తారు, కృష్ణ, గోదావరి నీళ్లు రావు” లాంటి భయాందోళనలు సృష్టించడంలో కృతకృత్యులయ్యారు. అసలింతకూ రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో నష్టపొయ్యేదెవరో, లాభపడేదెవరో విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది.

1) ప్రస్తుతం మన రాష్ట్రంలో అధికారం ఎప్పుడూ రెండు అగ్రకులాల చేతుల్లోనే ఉంటుంది. ఒకసారి కమ్మలకు అధికారం వస్తే మరోసారి రాయలసీమ రెడ్లకు వస్తుంది. రాష్ట్ర జనాభాలో వీరిశాతం కొద్దిదయినప్పటికీ అధికారం వీరిచేతిలో ఉండడానికి కారణం పెద్దరాష్ట్రంలో అధికారం రావాలంటే కావాల్సిన ధనబలం, మీడియా బలం వీరిదగ్గర ఉంది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలోని దళితులు, బీసీలు అధికారానికి దగ్గరవుతారు. ఈ కారణం వల్లే సీమాంధ్రలోని దళిత మహాసభ, బీసీలు విభజనకు మద్దతు ఇస్తున్నారు.

2) సమైక్యరాష్ట్రంలో తెలంగాణలాగే ఉత్తరాంధ్ర కూడా నిర్లక్ష్యానికి గురి అయ్యింది. రాష్ట్ర విభజన జరిగితే చిన్న రాష్ట్రంలో ఉత్తరాంధ్ర నాయకులు తమ డిమాండ్లను గట్టిగా వినిపించి తమప్రాంతానికి ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది.

3) సీమాంధ్రలోని మరో ప్రముఖ సామాజికవర్గమయిన కాపులు సమైక్య రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఎప్పటినుంచో కలలు కంటున్నా వారి కలలు నిజం కావడంలేదు. విభజన జరిగితే వీరు సీమాంధ్రలో బలమయిన వర్గంగా తయారవుతారు. అప్పుడు వీరికి అధికారం రావడం చాలా సులభం.

4) ఓడరేవు, పరిశ్రమలూ కలిగిన విశాఖ అత్యంత వేగంగా అభివృద్ధి చెంది త్వరలో దేశంలో పెద్ద నగరంగా ఎదగగలదు.

5) కొత్త రాజధాని ఎక్కడయితే అక్కడ రాజధానివలన అబివృద్ధి జరిగి ఆప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది.

6) విడిపోతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వోద్యోగులు రెండు రాష్ట్రాలలో విడిపోయినప్పటికీ కొత్త ఉద్యోగాలు సీమాంధ్రలో ఎక్కువగా అవసరం అవుతాయి. హైదరాబాదులో ఉండే ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు ఎక్కువమంది అక్కడే ఉండడానికి ఇష్టపడతారు కనుక వారి స్థానాలవల్ల ఆంధ్రాప్రాంత యువకులు ఎక్కువలబ్ది పొందురారు.

ఈవిధంగా సీమాంధ్రలో సుమారు ఎనభైఅయిదు శాతం దాకా విభజన వలన లాభపడతారు. కానీ నష్టపోయే కొద్ది శాతం మంది మొత్తం అందరికీ విభజనవలన నష్టం కలుగుతుందే అనే ఒక భయాందోళన క్రియేట్ చేశారు. ఇంతకూ ఈనష్టపొయే కొద్దిమంది ఎవరు?

1) లగడపాటి, రాయపాటి, కావూరు, సుబ్బరామిరెడ్డి, టీజీ వెంకటేశ్ లాంటి సీమాంధ్ర నాయకులు సివిల్ కాంట్రాక్టు వ్యాపారాలు చేస్తూ అధికారం ద్వారా సమైక్యరాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్టులు కొట్టేస్తున్నారు. విభజన జరిగితే వీరు ఇక సీమాంధ్ర ప్రాంతంలోని కాంట్రాక్టులకే పరిమితం కావాల్సి వస్తుంది.

2) రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వ్యాపారంలో ఉన్నవారు విభజన వలన తమ వ్యాపారాన్ని రెండుగా విడగొట్టి రెండు ప్రాంతాల్లో రెండు సంస్థలుగా నడపడమో లేక ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కావడమో చేయాల్సివస్తుంది. వీరి వ్యాపారాలకు విభజన దెబ్బ తీవ్రంగా ఉంటుంది.

3) అధికారాన్ని అడ్డుపెట్టుకుని హైదరాబాదులో భూకబ్జాలకు పాల్పడ్డ సీమాంధ్ర నాయకులకు పెద్ద దెబ్బే తగులుతుంది. విభజన తరువాత హైదరాబాద్ పరాయి రాష్ట్రంలో భాగమవుతుంది. సొంతరాష్ట్రంలో ఉన్న అధికారసౌలభ్యం అక్కడ ఉండదు.

4) సమైక్య రాష్ట్రంలో రాజకీయ, మీడియా, సినీఫీల్డ్, వ్యాపార రంగాల్లో ముందుండి క్రిష్ణ కింద పొలాలు అధికంగా కలిగిన కమ్మసామాజిక వర్గం ప్రస్తుతం సమైక్యరాష్ట్రంలో విపరీతంగా లాభపడుతుంది. విభజన వల్ల వీరికి గట్టి దెబ్బ తగులుతుంది. వీరి వ్యాపారాలు ఒక రాష్ట్రంలో, వీరి జనాభా మరొక రాష్ట్రంలో మిగిలిపోయి రెండు రాష్ట్రాల్లో వీరు అధికారానికి దూరమవుతారు.

5) రాయలసీమలో ఫాక్షన్ రాజకీయాలు చేసే వర్గానికి విభజన వలన దెబ్బ తగులుతుంది. చిన్నరాష్ట్రంలో బడుగులు అధికారానికి దగ్గరయితే వీరి పెద్దరికం తగ్గిపోయి అధికారం దూరం కావొచ్చు.

మొత్తంగా విభజన వలన సీమాంధ్రలో మెజారిటీ లాభపడితే కొద్ది శాతం మందికి మాత్రం నష్టం జరుగుతుంది. నిజానికి దీన్ని నష్టం అనడం కూడా సరికారు. మితిమీరిన లాభం అనుభవిస్తున్న వారికి కొంత లాభం తగ్గితే అది నష్టం కాదు. అయినా మనిషి ఆశకు అంతులేదుకదా, వీరు దాన్ని నష్టం కింద లెక్కేసుకుని తమలాభం తగ్గకూడదనే దురుద్దేశంతో రాష్ట్ర విభజనకు అడ్డుపడుతూ విభజన జరిగితే సీమాంధ్రలో అందరికీ నష్టం అన్న అభిప్రాయాన్ని కలుగజేస్తున్నారు. ఇకనయినా సీమాంధ్రలోని మిగతా ఎనభై ఐదు శాతం మంది తమపై జరుగుతున్న కుట్రను తెలుసుకుని దాన్నుంచి బయటపడితే తెలంగాణలో, సీమాంధ్రలో మెజారిటీకి లాభం జరిగేలా విడిపోవచ్చు.

చివరగా…విభజనను అడ్డుకునేవారు తెలుగు జాతి విడిపోగూడదు, తెలుగు జాతి ఐక్యత లాంటి కబుర్లెన్నో చెబుతారు, కానీ వారి అసలు ఉద్దేశం విభజన వలన వారి లాభాలు తగ్గిపోవడమే. లేకపోతే తెలంగాణకు న్యాయం జరుగుతుందనగానే జై ఆంధ్ర ఉద్యమాన్ని లేవదీసినవారికి తెలుగుజాతి ఐక్యతపై ఒక్కసారి అంత ప్రేమ ఎలా పుట్టుకొస్తుంది? సీమాంధ్ర సామాన్య ప్రజలారా, ఆలోచించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *