ఆయన సాదాసీదా మనిషి. అసాధారణ వ్యక్తిత్వం కలిగిన మహర్షి. బ్యాంకు ఉద్యోగిగా రైతుల కష్టాలు, కన్నీళ్లు చూశాడు ఫ్లోరైడ్‌నీటి బాధిత ప్రజలగోసకు కదిలిపోయాడు ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి పోరుబాట పట్టాడు
ఆయనే దుశ్చర్ల సత్యనారాయణ నల్గొండ జిల్లాలో నీటి విప్లవానికి కేరాఫ్ అడ్రస్ నదీజలాల్లో తెలంగాణ న్యాయమైన వాటాకోసం అలుపెరుగక పోరాడుతున్న ఉక్కు మనిషి
1987 రోజుల్లో.. నల్లగొండ, కనగల్ మండలాలు తీవ్ర అనావృష్టిలో కొట్టుమిట్టాడుతున్నాయి. రైతుల కళ్లల్లో తప్ప పొలాల్లో చుక్క నీళ్లు లేని పరిస్థితి. నేలతల్లిని నమ్ముకొని బోర్లు వేస్తే మూణ్నెళ్లు నిండకుండానే అడుగంటిపోయేవి. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగివ్వడం అటుంచి, అసలు బతకలేని దుస్థితి. బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్‌గా ఈ సమస్యను చాలా దగ్గర నుంచి చూసిన దుశ్చర్లకు ఏంచేయాలో పాలుపోలేదు. ఆంధ్రాలో ఒక్కో బోరు కనీసం 15ఏండ్లు పని పనిచేస్తుంది. కానీ, ఇక్కడ పట్టుమని మూణ్ణెళ్లుకూడా ఉండదు ఏందీ పరిస్థితి? దుశ్చర్ల ఆలోచన మూలాలను వెతకడం ప్రారంభించింది. నాలుగెకరాల్లో 18 బోర్లు వేసి, చివరకు బిడ్డ పెళ్లి చేయలేక చావుకు సిద్ధపడ్డ లింగారెడ్డి గుర్తుకొచ్చాడు. అప్పుచేసి మరీ రెండెకరాల్లో బోర్లు వేసిన మల్లయ్య కళ్ల ముందు మెదిలాడు. కన్నీళ్లై తిరిగాడు. అదే సమయంలో 1988 నుంచి దుశ్చర్లకు మర్రిగూడ మండల బాధ్యతలు కూడా పెరిగాయి. ఫ్లోరైడ్ రక్కసి వలలో చిక్కి విలవిల్లాడుతున్న గ్రామాలవి. మెలికలు తిరిగిన కాళ్లు, చేతులు.. పసిపిల్లలు కూడా పండు ముదుసల్లా ఉంటారు. వాళ్లు తింటుంది విషం.. తాగుతుంది విషం.. కానీ వేరే మార్గం లేదు. ఈ ప్రాంత సాగు, తాగు నీటి కోసం ఉద్దేశించిన శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(ఎస్‌ఎల్‌బీసీ) 1979లో మొదలైనా ఎండమావిగానే మిగిలింది. ఇక్కడి జన జీవనంలో మార్పురావాలంటే ఎస్‌ఎల్‌బీసీతోనే సాధ్యమని దుశ్చర్ల గుర్తించాడు. ఆ దిశగా ఉద్యమ పునాది వేశాడు.
జలసాధన సమితి ఏర్పాటు
నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీటిని సాధించాలన్న ఉద్దేశంతో దుశ్చర్ల రైతులు, న్యాయవాదులు, మేధావులను ఏకం చేశాడు. 1990 జనవరి 4న ‘జల సాధన సమితి’ సంస్థను స్థాపించాడు. ఫ్లోరోసిస్ బాధితులు, నీళ్లు లేక పంట, ఇంటా ఎండిన జనం దుశ్చర్లకు బాసటగా నిలిచారు. ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు, పాదయాత్రలు, బంద్‌లు.. ఇలా ప్రతి పోరాటంలోనూ జల సాధన సమితి ప్రత్యేకతను కనబర్చింది. ఎస్‌ఎల్‌బీసీ గురించి మొక్కుబడి ఉద్యమాలు చేస్తున్న రాజకీయ నాయకులకు చెంపపెట్టుగా నిలిచింది. దుశ్చర్ల పొద్దంతా ఆఫీస్ పని మీద ఫీల్డ్‌లో తిరిగేవాడు. రాత్రి గ్రామాల్లో సభలు, సమావేశాలు పెట్టి సాగు, తాగునీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేవాడు. ఒక రోజు ఉప్పు, నీళ్లు కలుపుకొని అన్నం తింటూ, ఇంకో రోజు మొక్కజొన్నలు తింటూ లక్ష్యం కోసం పయనిస్తున్న దుశ్చర్లకి ఒక్కోసారి అవికూడా దొరికేవికావు.
వివక్షపై వ్యతిరేక బావుటా
ప్రారంభం నుంచీ వివక్షను ఎదుర్కొంటున్న శ్రీశైలం ఎడమగట్టు కాల్వను మొత్తానికి ఎత్తేసేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రలను జల సాధన సమితి తిప్పికొట్టింది. నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఉత్తర్వుల మేరకు ఎస్‌ఎల్‌బీసీలోని 13 డివిజన్ ఆఫీసుల్లో ఏడింటిని, 4 సర్కిల్ ఆఫీసుల్లో మూడింటిని గుట్టుచప్పుడు కాకుండా మూసేయగా, మిగిలిన కార్యాలయాల మూసివేతను జల సాధన సమితి తన పోరాటాలతో అడ్డుకుంది. ఆ తర్వాత మళ్లీ 1993లో ప్రాజెక్టు పరిధిలో పని చేస్తున్న 26 మంది ఇంజనీర్లను కోట్ల విజయభాస్కర్‌డ్డి ప్రభుత్వం మాస్ ట్రన్స్ఫర్ చేయగా, జలసాధన సమితి మహిళా సభ్యులు 11మంది కలెక్టరేట్ ఎదుట నిరాహారదీక్షకు దిగారు. జిల్లా ప్రజాప్రతినిధులు చేతులెత్తేసిన నేపథ్యంలో ఎస్‌ఎల్‌బీసీని ఎత్తేసే ప్రయత్నాన్ని మానుకోకపోతే, శ్రీశైలం ప్రాజెక్టునే కూల్చేస్తామని ప్రభుత్వానికి దుశ్చర్ల బహిరంగ హెచ్చరికలు పంపాడు. దాంతో సీఎం, గవర్నర్, శ్రీశైలం ప్రాజెక్టు ఛీప్ ఇంజనీర్ ఆయనతో చర్చలు జరిపారు. ఎట్టకేలకు దిగొచ్చిన ప్రభుత్వం అధికారుల ట్రాన్స్‌ఫర్లను వెనక్కి తీసుకుంది. ఆ ఉత్తర్వులను ప్రాజెక్టు ఛీప్ ఇంజనీర్ 20వ రోజు మహిళల దీక్షా శిబిరానికి వచ్చి మరీ అందజేశారు. అప్పటినుంచే నదీజలాల్లో న్యాయమైన వాటా కోసం జలసాధన సమితి తన పోరాటాన్ని మరింత తీవ్రం చేసింది. ఆ క్రమంలోనే నదులన్నింటినీ జాతీయం చేయాలన్న డిమాండ్ ముందుకొచ్చింది.
పోరాట పర్వం
20ఏండ్ల ప్రస్థానంలో జలసాధన సమితి ఎన్నో పోరాటాలు చేసింది. దుశ్చర్ల వేలాదిమందితో నల్లగొండ నుంచి శ్రీశైలం, హైదరాబాద్‌కు పాదయాత్రలు చేపట్టారు. 1992లో పెండింగ్ ప్రాజెక్టుల్లో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ, శ్రీరాంసాగర్‌ను నేదురుమల్లి జనార్దన్‌డ్డి ప్రభుత్వం ఆ జాబితా నుంచి కూడా తొలగిస్తే, లక్షమందితో పోస్టుకార్డు ఉద్యమం చేశారు. ఢిల్లీ స్థాయిలో అలుపెరగని పోరాటం చేసి ఆ రెండు ప్రాజెక్టులు తిరిగి పెండింగ్ జాబితాలోకి వచ్చేలా చేశారు. ఆ తర్వాత జలసాధన సమితి సభ్యురాలు డి.లక్ష్మిని నల్లగొండ శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించి నిరసన తెలిపారు. 1996 పార్లమెంటు ఎన్నికల్లో జలసాధన సమితి ‘నామినేషన్ల నిరసన’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నల్లగొండ పార్లమెంటు స్థానానికి ఏకంగా 480మంది నామినేషన్లు దాఖలు చేసి, సాగు, తాగునీటి ప్రాజెక్టులపై, ముఖ్యంగా ఎస్‌ఎల్‌బీసీ విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యంపై నిరసన గళం వినిపించారు. ఇందులో ఫ్లోరోసిస్ బాధితులు, మహిళలు, యువకులు, బీద, బిక్కజనమే ఉన్నారు.
నామినేషన్లు పెద్దఎత్తున రావడంతో ఎన్నికల కమిషన్ ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేయడం గమనార్హం. 2003లో ఎముకలు కొరికే చలిలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా జలసాధన సమితి వందలాది మందితో జంతర్‌మంతర్ వద్ద మూడ్రోజుల పాటు దీక్ష చేపట్టింది. దుశ్చర్ల అప్పటి ప్రధాని వాజ్‌పేయి ముందు అంశల స్వామి అనే 18 ఏండ్ల ఫ్లోరోసిస్ బాధితుడిని పడుకోబెట్టి నల్లగొండ ఫ్లోరైడ్ గోస వినిపించాడు. అందుకు చలించిపోయిన వాజ్‌పేయి సమస్య పరిష్కారానికి హామీనిచ్చి, దీక్షకు వచ్చిన వారందరికీ ప్రత్యేకంగా రైలు టిక్కెట్లు బుక్ చేయించి పంపించారు. అదే సంవత్సరం నదీ జలాల్లో న్యాయమైన వాటా కోసం దుశ్చర్ల హరిద్వార్, రిషికేష్ వద్ద మూడ్రోజుల పాటు దీక్ష చేపట్టారు. ఎస్‌ఎల్‌బీసీ నేటికీ బతికి ఉందంటే జలసాధన సమితి ఉద్యమ ఫలితమే..! అందుకు సంబంధించిన పైప్‌లైన్ పనులు ఇంకా జరుగుతుండగా, ఇప్పటికే ఐదు నియోజకవర్గాల పరిధిలోని 500కి పైగా గ్రామాల్లో కృష్ణాజలాలు అందుతున్నాయి. పొరుగున ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలోనూ సాగు, తాగునీటిపై దుశ్చర్ల ఆరేళ్లపాటు సభలు, సమావేశాలు పెట్టి ప్రజలను చైతన్యపరిచాడు.
ఉద్యోగానికి దూరం
దుశ్చర్లపై కక్ష గట్టిన ప్రజాప్రతినిధులు ఆయన్ని ఉద్యమానికి దూరం చేయాలని కుట్ర పన్నారు. బ్యాంకు ఉద్యోగి ఉద్యమం పేర జనాన్ని ఉసిగొల్పుతున్నాడంటూ ‘రాజకీయం’ చేశారు. ఉద్యమమా? ఉద్యోగమా? తేల్చుకోమంటూ దుశ్చర్లలో 1996లో యూనియన్ బ్యాంకు ఏజీఎం నర్సారెడ్డి రాత్రి 11 గంటల వరకు జరిపిన చర్చల్లో దుశ్చర్ల జనంవైపే నిలిచాడు. ఆయన తొలగింపుపై జలసాధన సమితి సభ్యులు, ప్రజలు నిరసనలకు దిగగా.. దుశ్చర్లే వారిని శాంతింపజేశారు. కాగా, అదే సంవత్సరం అంతకుముందు బ్యాంకు ఉద్యోగి ఉద్యమాల్లో పాల్గొంటూ జనాన్ని ఉద్రేకపరుస్తాడని ప్రభుత్వం దుశ్చర్లపై కేసు పెట్టింది. పోలీసులు ఆయన్ని నకిరేకల్ కోర్టుకు సరెండర్ చేయగా, తనది న్యాయపోరాటమేనంటూ దుశ్చర్ల మెజిస్ట్రేట్‌కు రివర్స్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అప్పీల్ చేసుకుంటే బెయిల్ మంజూరు చేస్తామని మేజిస్ట్రేట్ చెప్పుకొచ్చినా, జైలుకే వెళ్లాడు. ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించిన పరిస్థితుల్లో కలెక్టర్, జైలర్ చర్చలు జరిపినా వెనక్కి తగ్గలేదు. దీంతో న్యాయస్థానమే 16వ రోజున దుశ్చర్లను బేషరతుగా విడుదల చేసింది. భారత న్యాయవ్యవస్థ చరిత్రలోనే ఇది ప్రప్రథమం.
ఆహ్వానాలు అందినా..
నల్లగొండ జిల్లా మోతె మండలంలోని రాఘవపురం దుశ్చర్ల సత్యనారాయణ స్వగ్రామం. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈయన హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ బీఎస్సీ చదివాడు. ఆ తర్వాత ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగం. తొలిపోస్టింగ్ పులివెందుల ఆ తర్వాత 1980లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫీల్డ్ ఆఫీసర్‌గా చేరాడు. కృష్ణ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొంతకాలం పనిచేసి, హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత 1987లో నల్లగొండ మండలానికి రావడంతోనే దుశ్చర్ల ఉద్యమ ప్రస్థానానికి బీజం పడింది. ప్రస్తుతం ఈయన జలసాధన సమితి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శిగా, రైతు సమితి అధ్యక్షుడిగా, సమాన విద్య సాధన సమితి సలహాదారుగా కూడా సేవలందిస్తున్నాడు. కాగా, పలు పార్టీల నుంచి రాజకీయాల్లోకి ఆహ్వానం అందినా దుశ్చర్ల నిరాకరించాడు. పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తూ లేఖ రాశారు. ఆ తర్వాత టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పీఆర్పీ ప్రారంభంలో చిరంజీవి తమ పార్టీల్లో చేరమని కోరినా సున్నితంగా తిరస్కరించాడు.
తెలంగాణ ఉద్యమంలో మాత్రం చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. నిరసనలు, సభలు, సమావేశాలు, ధూంధాం కార్యక్రమాల్లో పాల్గొంటుంటాడు. తెలంగాణ కోసం ఎవరే పిలుపునిచ్చినా ముందుండి పాటిస్తుంటాడు. నదుల జాతీయకరణ, నదీ జాలాల్లో తెలంగాణకు నాణ్యమైన వాటా కోసం అవిశ్రాన్త పోరాటం చేస్తున్నాడు.
అయినా వెరవలే…!
“సాగు, తాగు నీటి కోసం జిల్లా ఎల్లలు దాటినం. 20 ఏండ్ల కిందటే జంతర్‌మంతర్ కేంద్రంగా పోరాటాలు నడిపినం. నీళ్ల నిప్పు పెడుతుండని, నాయకులు నా నౌకరి మీద పడ్డరు. అయినా వెరవలె. నీటి విషయంలో తెలంగాణ మొదటి నుంచీ దగా పడుతున్నది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు కాల్వలను 1997లో ఒకేసారి ప్రతిపాదించినా, ఎడమ గట్టు కాల్వను కావాలనే నిర్లక్ష్యం చేశారు. లక్షలాది మంది ఫ్లోరోసిస్ బారినపడి విలవిల్లాడుతున్నా రాజకీయ, అధికార యంత్రాంగాలు నిద్రావస్థను వీడడంలేదు. పార్టీల్లో నాయకులు, ఉద్యోగాల్లో అధికారులు అంతా ‘వాళ్లే’నాయె. మనోళ్లు కూడా మనకు అడ్డుపడుతుండడం దారుణం. రాజకీయ పార్టీల అనైక్యత వల్లే తెలంగాణ రాష్ట్రం రావడం లేదు. సుక్క, ముక్క, సీటు, సోటు, నోటుకు నాయకులు అమ్ముడు బోతున్నారు. కొనుక్కుంటున్నారు. ఈ పరిస్థితి మారనంత వరకు ఇంతే..”
ఎం.నరేందర్, నల్లగొండ
ఫోటోలు: పల్లె లక్ష్మణ్ (టీన్యూస్, మోతె)
నమస్తే తెలంగాణ నుండి