mt_logo

వెన్నెల వాకిట్లో..కిన్నెర గానం

– లామకాన్‌లో జానపద గాన ప్రవాహం
-ఆకట్టుకున్న పాలమూరు కళాకారుడి ప్రదర్శన

భుజమున కిన్నెర చేతులా అందెలు మదిలోన పదములు మహిమగల సిటికెలు ఉప్పొంగె కన్నీట ఊరేటి రాగాలదారిపొడవున పంచి దాటిపోతుంటేనుచెట్టుపై సిలకమ్మ నీ చెలిమి గోరింద కిన్నెరుంటె సాలు బైరాగి సిలక ఉన్న, లేకున్నొకటె బైరాగి
– గోరటి వెంకన్న

ఊయలలో పసిపాప నిదురపోయేటప్పుడు.. ఊడల మర్రి కింద ఊరి జనం సేద తీరేటప్పుడు… వెన్నెల వాకిట్లో కురిసిన కిన్నెరగానం.. ఇప్పుడు.. పాలమూరు కోట బురుజు నుంచి హైటెక్ నగరం అంచులను తాకింది. జులపాల జుట్టు… పంచెకట్టు… కోరమీసం.. భుజం మీద పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యంతో ఆకట్టుకునే ఆహార్యం మొగులయ్యది. ఆడా ల్యాడ్ మియాసావ్… ఈడా ల్యాడ్ మియాసావ్.. అంటూ ఆయన గానం చేస్తే ఎంత వేగంగా వెళ్లేవారైనా ఒక్కక్షణం ఆగిపోవాల్సిందే. పాలమూరు పల్లె నుంచి పడిలేస్తూ.. పడిలేస్తూ… పట్నం వేదికపై కిన్నెర గానం ఆలపించాడు. గురువారం లామకాన్‌లో మొగులయ్య కిన్నెర గానం నగరవాసులను అమితంగా ఆకట్టుకుంది.

అతడు పలికించే గమకాలు మరో ప్రపంచంలోకి నడిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. ఒక్కో వీరగాథ నరనరాల్లో నెత్తురు ఉరకలెత్తిస్తుంది. కిన్నెర శబ్ధం మృదు మధురంగా మదిని పరివశింపజేస్తుంది. మొగులయ్య అంతరించిపోతున్న ఆ జానపద కళకు సజీవ సాక్ష్యం. ఆయన పండుగ సాయన్న వీరగాథ వినిపించినా, పిల్ల జాతర బోదం పిల్ల.. దాదిమా ధర్మశాల, సీతమ్మ ఉండే పర్ణశాల, రాముడు ఉండే లక్ష బండ సూసి వద్దామా పిల్ల… అంటూ బావా మరదళ్ల సంవాదమినిపించినా మైమర్చిపోవాల్సిందే. ఆ కళాకారుడి గాన ప్రవాహంలో ఓ సాయంత్రం నగరి తడిసి ముద్దదైంది. తన్మయత్వంలో మునిగిపోయింది.

-వీరగాథలు..
మొగులయ్యది కంచుకంఠం. ఆయన గానం వింటే మైమర్చిపోవల్సిందే. పాలమూరు జిల్లా జానపద హీరో మియాసావ్ వీరగాథ మొగిలయ్య నోటి వెంట వింటే ఔరా అనిపిస్తుంది. ఉన్నోళ్లను కొట్టి, లేనోళ్లకు పెట్టే తత్వం మియాసావ్‌ది. దోచుకున్న డబ్బును పాలమూరు ప్రజల కోసం.. ఖర్చుపెట్టిన వ్యక్తి. అలాంటి మీయాసావ్ చరిత్రను ఇప్పటికీ జనం ప్రేమతో చెప్పుకుంటరు. ఈ కథను మొగులయ్య తాతల కాలం నుంచి చెప్తున్నారు. పాలమూరు జిల్లాలో మరోపోరాట యోధుడు పండుగ సాయన్న వీరగాథను, దొరతనానికి వ్యతిరేకంగా నిలబడిన బైండ్లోళ్ల కుర్మయ్య గాథలు కళ్లముందు కనిపించేలా వినిపిస్తాడు. ఈ గాథలు సంస్థానాలకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన పోరాటాలకు నిదర్శనం. నాటి సామాజిక జీవితానికి దర్పణం. చారిత్రక వాస్తవాలు కళ్లముందు మెదిలినట్లు వినిపించడం మొగులయ్య ప్రత్యేకత.

-పన్నెండు మెట్ల కిన్నెర
మొగులయ్య వాడే పన్నెండు మెట్ల కిన్నెర అరుదైన వాయిద్యం. ఆయన తాతల కాలంలో ఏడు మెట్ల కిన్నెర ఉండేది. మామూలుగా కిన్నెరకు ఒక సొరకాయ బుర్ర ఉంటుంది. కానీ మొగిలయ్య కిన్నెరపై మరిన్ని రాగాలు పలికించాలనుకుని, దాన్ని 12 మెట్లుగా మార్చాడు. సరికొత్త రాగాలతో జనాన్ని తన కథ, పాట నుంచి జారిపోకుండా ఆకట్టుకుంటున్నాడు. రెండుజతుల నడకతో సాగే మొగులయ్య పాట నడుమ నడుమ శభాష్ అంటూ జనాన్ని ఉత్తేజ పరుస్తాడు. ఆడాల్యాడ్ మియాసావ్ అంటూ వీరగాథలు పాడినా.. ఆడేటప్పడు.. అంచుచీర.. పాడేటప్పుడు పట్టుచీర.. గుండముల దుంకేటప్పుడు గురిగింజ చీర అంటూ ప్రేమ గాథను పాడినా కిన్నెర శబ్ధం మనసుకు ఇంపుగా మదిని పరవశింపజేస్తుంది.

-పాటే ప్రాణమై..
మొగులయ్య పాట పాడుతున్నంత సేపూ తనువు, మనసు పాటలోనే లీనమైపోతుంది. చూసే జనాలు లోకం మర్చిపోతారు. తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన కళను నమ్ముకున్న మొగులయ్యది నేటికీ కూటిపోరాటమే. బతుకు దెరువు లేక అచ్చంపేట అంగట్లో గానం చేసేవాడు. అయినా కష్టాలు తీరలేదు. నేను కళను ఏ రోజూ అమ్ముకోలేదు. నాకు కళే ప్రాణం. దాన్ని నమ్ముకొని బతుకు బండి నెట్టుకొచ్చాను. ఊపిరిమెసలని ఇబ్బందులొచ్చినప్పుడు మహారాష్ట్రకు మట్టిపనికి పోవాలనుకున్న అంటూ తన కన్నీటి గాథను వినిపించాడు మొగులయ్య.

ఆశ్రిత కులాల సాహిత్యం, కళలకు ఆదరణ కరువుతోంది. తరతరాలుగా వారసత్వంగా వచ్చిన ఈ కళ అంతరించే ప్రమాదముంది. కిన్నెర వీణ వంటి జానపద కళల్ని కాపాడాల్సిన అవసరముంది అని నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వాగేష్ పేర్కొన్నారు. మొగులయ్య లాంటి కళాకారులను తెలంగాణ సమాజం నిలబెట్టుకోవాల్సిన అవసరముందని గుర్తు చేశారు.

Source: [నమస్తే తెలంగాణ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *