mt_logo

వైభవంగా బతుకమ్మ పండుగ

-మహిళా సీఎంలు, మంత్రులు, ప్రముఖులకు ఆహ్వానం
-పండుగకు రూ.10 కోట్లు మంజూరు
-ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు
-25 వేల మందితో సద్దుల బతుకమ్మ
-అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్
-వచ్చే పండుగనాటికి శాశ్వత వేదిక
-నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసే అవకాశం
తెలంగాణ మహిళలు అత్యంత పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకొనే బతుకమ్మ పండుగను వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. అందులోనూ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొదటిసారిగా ఈ పండుగ జరుగనుండటంతో ఏర్పాట్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నది. ఈ పండుగను ప్రజలు అబ్బురపడేరీతిలో, అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సద్దుల బతుకమ్మ రోజున హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై 25వేల మంది మహిళలతో, దేశంలోని వివిధ రాష్ర్టాల మహిళా సీఎంలు, మంత్రులు, ప్రముఖులతో భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే పండుగ నాటికి నెక్లెస్‌రోడ్డులో బతుకమ్మ స్కేర్‌ను ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఈ ఏడాది పండుగ నిర్వహణకు పది కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

పది జిల్లాల కలెక్టర్లకు ఒక్కో జిల్లాకు పండుగ నిర్వహణ కోసం రూ.10 లక్షల చొప్పున విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర పండుగగా ప్రకటించిన బతుకమ్మ పండుగ ఉత్సవాలను ఈ నెల 24నుంచి అక్టోబర్ 2వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటకలోని మైసూర్‌లో నిర్వహించే దసరా ఉత్సవాల తరహాలో తెలంగాణలో బతుకమ్మ పండుగను జరుపుతామని సీఎం చెప్పారు. బతుకమ్మ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలిచే బతుకమ్మ పండుగను యావత్తు భారతదేశం దృష్టిని ఆకర్షించే విధంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఈ పండుగకోసం పలు రాష్ర్టాల మహిళా ముఖ్యమంత్రులు జయలలిత, వసుంధరా రాజే, ఆనందీబెన్, మమతా బెనర్జీలతోపాటు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మహిళా మంత్రులను, మహిళా గవర్నర్లను, కిరణ్‌బేడీవంటి ప్రముఖులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఒక విదేశీ మహిళా ప్రముఖురాలిని కూడా ఈ పండుగకు గౌరవ అతిథిగా ఆహ్వానిస్తామని సీఎం తెలిపారు. ఇతర రాష్ర్టాల మహిళా సీఎంలు, లోక్‌సభ స్పీకర్, మహిళా మంత్రులతో తానే స్వయంగా మాట్లాడి ఆహ్వానిస్తానని చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే పండుగలో ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులు పాల్గొంటారని అన్నారు. తెలంగాణకు చెందిన మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాష్ట్రస్థాయి మహిళా అధికారులు కూడా ఈ పండుగలో పాల్గొనాలని ముఖ్యమంత్రి కోరారు.

పండుగ రోజున ఎల్బీ స్టేడియంలో బతుకమ్మలను పేర్చుకొని సుమారు 25వేల మంది మహిళలు ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఊరేగింపుగా వస్తారు. ట్యాంక్‌బండ్‌పైనే పెద్ద వేదిక ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులను వేదికపై కూర్చోబెడతారు. అక్కడే మహిళలు బతుకమ్మలు ఆడుతారు. సుమారు 10వేల బతుకమ్మలను ప్రభుత్వ సహాయంతోనే ఎల్బీ స్టేడియంలో పేరుస్తారు. బతుకమ్మలను పేర్చడానికి కావాల్సిన గునుగు, తంగేడు పూలను కూడా ప్రభుత్వమే సమకూర్చుతుంది. 25వేల మంది మహిళలు బతుకమ్మలతో వెళుతుంటే ఆకాశంలోని హరివిల్లు నేలకు దిగిందా అనే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. బతుకమ్మ తెలంగాణ జీవితంతో ముడిపడి ఉన్న పండుగని, అన్నింటికి మించి తెలంగాణ సెంటిమెంట్‌కు బతుకమ్మ పండుగకు అవినాభావ సంబంధం ఉందని, అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగను అత్యంత ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించారు.

శోభాయమానంగా హైదరాబాద్
బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులు హైదరాబాద్ నగరాన్ని ప్రత్యేకించి ట్యాంక్‌బండ్, హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలను శోభాయమానంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ రంగురంగుల విద్యుత్‌దీపాలను ఏర్పాటు చేయాలని, హుస్సేన్‌సాగర్‌లో వాటర్ ఫౌంటేన్‌లను ఏర్పాటు చేయాలని, నగరంలోని ప్రధాన కూడళ్లలో హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సద్దుల బతుకమ్మ పండుగ రోజున హుస్సేన్‌సాగర్ చుట్టూ బతుకమ్మ పాటలు వినిపించేలా స్పీకర్‌లు ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పండుగ గొప్పగా జరగాలని సీఎం కలెక్టర్లకు సూచించారు. చెరువుల వద్ద లైట్లు ఏర్పాటు చేయడంతోపాటు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, చెరువులకు వెళ్లే దారులకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అన్ని గ్రామాల సర్పంచ్‌లకు సర్క్యూలర్లు జారీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పండుగ రోజుల్లో అన్ని దేవాలయాలను సీరియల్ లైట్లతో అలంకరించాలని, ముఖ్య కూడళ్లలో లైట్లతో తయారు చేసే బతుకమ్మలను కూడా ప్రదర్శించాలని చెప్పారు.

వచ్చే ఏడాదికి బతుకమ్మ స్కేర్
ఈసారి ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ పండుగను నిర్వహించి, వచ్చే ఏడాదికి శాశ్వత ప్రాతిపదికన నెక్లెస్ రోడ్‌లో బతుకమ్మ స్కేర్ నిర్మించాలని సీఎం అధికారులకు చెప్పారు. సామాజిక అంతరాలు లేకుండా ప్రజలందరూ ఉమ్మడిగా పండుగ జరుపుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. చెరువుల వద్ద రెయిలింగ్‌లు ఏర్పాటు చేయాలని, గజఈతగాళ్లను, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం, నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లవద్ద హోర్డింగ్‌లు పెట్టాలని సూచించారు. ఢిల్లీలో కూడా బతుకమ్మ పండుగ హోర్డిగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సాంస్కృతిక శాఖ తెలంగాణ జాగృతితో కలిసి ఈ పండుగను సమన్వయంతో నడిపించాలని చెప్పారు. సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కేవీరమణాచారి, ఎంపీలు కవిత, జితేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచం ఆశ్చర్యపోయేలా బతుకమ్మ వేడుకలు: కవిత
ప్రపంచం ఆశ్చర్యపోయేలా హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గతేడాది ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించి రూ.10లక్షలు కేటాయించినప్పటికీ వాటిని కూడా సక్రమంగా వినియోగించలేదని విమర్శించారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొన్ని జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లు చేసినా, వారికి ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బతుకమ్మ, బోనాలను రాష్ట్ర పండుగలుగా ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. పండుగ నిర్వహణకు రూ.10 కోట్లు కేటాయించిన ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పండుగకు సంబంధించిన పాటలు, సాహిత్యం, పరిశోధనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనున్నట్లు చెప్పారు. దసరా పండుగ అనంతరం హైదరాబాద్‌లో అంతర్జాతీయ మేయర్ల సదస్సు నిర్వహిస్తున్నందున, బతుకమ్మ వేడుకలను, మేయర్ల సదస్సును అనుసంధానంచేస్తూ నగరాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దనున్నట్లు కవిత తెలిపారు. బతుకమ్మ వేడుకలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించేందుకు శాశ్వతవేదికకోసం మూడెకరాల స్థలం కేటాయించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఆమె తెలిపారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *