mt_logo

ఉత్తమ్, లగడపాటిలకు ఝలక్ ఇచ్చిన ఈసీ!!

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున నగదు తరలింపు వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై, నిబంధనలకు వ్యతిరేకంగా ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు వెల్లడించిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై ఈసీ కఠిన చర్యలకు ఆదేశించింది. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా 2.5 కోట్ల భారీ నగదును నల్లగొండ జిల్లా సూర్యాపేట వద్ద ఇన్నోవా కారు బానెట్లో అక్రమంగా తరలిస్తుండగా అగ్నిప్రమాదం జరిగి చాలావరకు నగదు దగ్ధమైన విషయం తెలిసిందే. కారుపై హుజూర్ నగర్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో ఆ వాహనం ఉత్తమ్ కుమార్ సోదరుడు గౌతమ్ రెడ్డిదిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కారులోని నగదు ఉత్తమ్ కుమార్ కి చెందినదిగా నిరూపణ కావడంతో ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్ లాల్ డీజీపీని ఆదేశించారు.

మరోవైపు లగడపాటి రాజగోపాల్ తాను నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను శనివారం మీడియాకు బహిర్గతం చేయడం పట్ల కూడా ఈసీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన చట్టం కింద నోటీస్ జారీ చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో టీడీపీ అధికారంలోకి వస్తుందని లగడపాటి మీడియాకు తెలిపినందున ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్ వివరాలను ప్రసారం చేసిన పది ఎలక్ట్రానిక్ ఛానళ్ళకు కూడా నోటీసులు అందజేసినట్లు ఈసీ తెలిపింది. ఈ రెండు సంఘటనలకు సంబంధించి దోషులను అరెస్టు చేసేందుకు కూడా వెనుకాడే ప్రసక్తే లేదని భన్వర్ లాల్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *