ఎన్నికల ఫలితాలు వచ్చినతర్వాత పార్టీ ఎమ్మెల్యేలంతా కూర్చుని సీఎం ను ఎన్నుకుంటామని, తెలంగాణ బాధలు తీరి, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చేవెళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కేఎస్ రత్నం అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో ను అమలు చేయాలంటే పార్టీ అధినేత కేసీఆర్ వల్లే అవుతుందని, దళిత సీఎం విషయంలో కేసీఆర్ పై కొందరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సీఎం అయితేనే తమ సమస్యలు తీరుతాయని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఎమ్మెల్యేలందరం కలిసి కూర్చుని తమ నాయకుడిని ఎన్నుకుంటామని రత్నం స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బంగారు తెలంగాణ అంటున్నారని, 60 ఏళ్లుగా పాలిస్తున్న వారు అప్పుడే ఎందుకు బంగారు తెలంగాణగా తీర్చిదిద్దలేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీసీ సీఎం కార్డును ఉపయోగించి ఆర్ క్రిష్ణయ్యను బలిపశువును చేశారని, ఆంధ్రాలో కూడా బీసీని సీఎం చేస్తానని చంద్రబాబు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఓటింగ్ శాతం భారీగా పెరిగిందని, ఫలితాలు తమకే అనుకూలంగా ఉన్నాయని రత్నం ధీమా వ్యక్తం చేశారు.
మానకొండూరు ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, తెలంగాణలో దళితుల జీవితాలు బాగుపడాలంటే కేసీఆర్ సీఎం కావాలని, ఆయనే తెలంగాణకు బలమైన నాయకుడని అన్నారు. తెలంగాణకు రాబోయే ఐదేళ్ళు చాలా కీలకమని, తెలంగాణపై ఉన్న ఆంక్షలు తొలిగి సంపూర్ణ తెలంగాణ ఏర్పడాలంటే సమర్ధుడైన నాయకుడు సీఎం కావాలని, కేసీఆరే తెలంగాణకు బలమైన నాయకుడని పేర్కొన్నారు. మరో నేత గజ్జెల నగేష్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.